దళిత బిడ్డల్ని స్వార్థ రాజకీయాలకు బలిచేస్తున్న జగన్ వారికి మేనమామ అవుతాడా?: టీడీపీ నేత జవహర్

కోడికత్తి కేసు బాధితుడైన దళితబిడ్డ శ్రీనివాస్‌కు జగన్ ఎప్పుడు విముక్తి కల్పిస్తారని టీడీపీ నేత, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. కోర్టుకు హాజరుకాకుండా తప్పించుకుంటూ విచారణలో జాప్యానికి జగనే కారణమవుతున్నారని విమర్శించారు. కోడికత్తి ఘటనలో కుట్రకోణంపై విచారణ జరపాలంటూ జగన్ ఇప్పుడు చిలుకపలుకులు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు.

మంగళవారం మీడియాతో జవహర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ మహానీయుడు చెప్పినట్టు పులుల్ని వదిలేసి మేకల్ని బలి తీసుకుంటున్నారని జగన్ పై మండిపడ్డారు. ‘‘నాలుగేళ్ల నుంచి సెంట్రల్ జైల్లో శ్రీనివాస్ మగ్గిపోతున్నా, అతని తల్లిదండ్రులు కన్నీటితో విలపిస్తున్నా జగన్‌లో చలనం లేదు. శ్రీనివాస్ తల్లిదండ్రుల ముఖం చూసి, వారికి ధైర్యం చెప్పడానికి కూడా వైసీపీ అధినేతకు మనసురాలేదు. దళిత బిడ్డల్ని తనస్వార్థ రాజకీయాలకు బలిచేస్తున్న జగన్.. వారికి మేనమామ అవుతాడా?’’ అని ప్రశ్నించారు.

గత ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కోడికత్తి డ్రామా, బాబాయ్‌పై గొడ్డలివేటు నాటకాలు ఆడిన జగన్.. ఈ ఎన్నికల్లో లబ్ధి కోసం ఎలాంటి కొత్త నాటకాలు ఆడుతున్నాడో చెప్పాలన్నారు. కోడికత్తి కేసులో శ్రీనివాస్ కుటుంబాన్ని జగన్ వెంటనే ఆదుకోకుంటే దళితుల ఆగ్రహానికి బలికాక తప్పదని జవహర్ హెచ్చరించారు.


More Telugu News