Monsoon 2023: ఈ ఏడాది వర్షపాతం తక్కువే: స్కైమెట్

  • సాధారణం కంటే తక్కువ నమోదు కావచ్చన్న అంచనా
  • ఎల్ నినో ప్రభావంతో పెరగనున్న ఉష్ణోగ్రతలు
  • ఉత్తర, మధ్య భారత్ ప్రాంతాల్లో అధిక వర్షాభావం
Monsoon 2023 to be below normal amid El Nino threat forecasts Skymet

ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ ‘స్కైమెట్’ తాజాగా అన్నదాతలకు రుచించని విషయాన్ని చెప్పింది. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని అంచనా వేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ కాలానికి వర్షాలు దీర్ఘకాల సగటులో 94 శాతంగా ఉండొచ్చని తెలిపింది. ఈ ఏడాది వర్షాలు సాధారణం కంటే తక్కువే ఉండొచ్చని స్కైమెట్ జనవరిలోనే ప్రాథమికంగా అంచనా వేసింది. ఏప్రిల్ లో మరోసారి ఎల్ నినో అంచనాల ఆధారంగా తమ విశ్లేషణ తెలియజేస్తామని ప్రకటించింది. 

‘‘లానినా ప్రభావంతో (అనుకూలం) నైరుతి రుతుపవన కాలంలో గత నాలుగు సీజన్ల నుంచి సాధారణం, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పుడు లానినా ముగిసింది. ఎల్ నినో పెరుగుతోంది. వర్షాకాలానికి దీని ప్రభావం మరింత పెరుగుతుంది. దీనివల్ల వర్షాల సీజన్ బలహీనంగా ఉండొచ్చు’’ అని స్కైమెట్ ఎండీ జతిన్ సింగ్ వెల్లడించారు. 

ఉత్తర భారత్, మధ్య భారత్ లోని ప్రాంతాలు ఎక్కువ వర్షాభావాన్ని ఎదుర్కొంటాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో జులై, ఆగస్ట్ లో సరైన వర్షపాతం ఉండకపోవచ్చని పేర్కొంది. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో సాధారణం కంటే తక్కువ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఎల్ నినో, లానినో అనేది పసిఫిక్ మహాసముద్రంపై ఉష్ణోగ్రతలకు సంబంధించినవి. వీటి ఆధారంగానే వర్షపాతం ఆధారపడి ఉంటుంది. భారత వాతావరణ విభాగం ఇంకా ఈ ఏడాది వర్షాకాలానికి సంబంధించి అధికారిక అంచనాలను ప్రకటించలేదు. ప్రస్తుత వేసవిలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదువుతాయని ఇప్పటికే ప్రకటించింది.

More Telugu News