Corona Virus: చిన్న పిల్లలపై పంజా విసురుతున్న కొత్త వేరియంట్.. లక్షణాలు ఇవే!

  • గతేడాది సెప్టెంబరు తర్వాత తొలిసారి 6 వేల మార్కును దాటిన కేసులు
  • పెరుగుతున్న కేసులకు ‘ఎక్స్‌బీబీ 1.16’ వేరియంట్ కారణమని అభిప్రాయం
  • అధిక జ్వరం, దగ్గు, జలుబు, కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలు
  • ఈ వేరియంట్ మరింత బలపడే అవకాశం ఉందంటున్న నిపుణులు
Corona New Variant Attacks on Children

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. కేసుల పెరుగుదలకు ‘ఎక్స్‌బీబీ 1.16’ లేదంటే, ‘ఆర్ట్కురుస్‌’గా పిలిచే కొత్త వేరియంటే కారణం కావొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత వేరియంట్లలో లేని కొన్ని లక్షణాలను ఇందులో గుర్తించినట్టు చెబుతున్నారు. ఈ వేరియంట్ చిన్నారులపై అధిక ప్రభావాన్ని చూపిస్తోందని, వారిలో అధిక జ్వరం, దగ్గు, జలుబు వంటివాటితోపాటు కళ్లకు పుసులు, దురద వంటి లక్షణాలు ఉన్నట్టు చెప్పారు. చివరి రెండు లక్షణాలను గత వేరియంట్లలో గుర్తించలేదని, ఇవి కొత్త వేరియంట్ లక్షణాలేనని అంటున్నారు.

ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఈ కొత్త వేరియంట్ ఎక్స్‌బీబీ 1.16కు సంబంధించిన కేసులు వందల సంఖ్యలో నమోదైనట్టు ఇండియన్ సార్స్‌కోవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇవి రెండు కేసులు మాత్రమే ఉన్నట్టు పేర్కొంది. అంతేకాదు, గత వేరియంట్లతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని, కాబట్టి ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. 

అయితే, ఈ కొత్త సబ్ వేరియంట్ మరీ ప్రమాదకరం కాకపోయినా రూపాంతరం చెంది బలపడే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య  సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రతినిధి మరియా వాన్ ఖెర్ఖోవ్ ఇటీవల చెప్పారు. కాగా, దేశంలో నిన్న 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబరు తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

More Telugu News