ప్లీజ్.. ఎన్ కౌంటర్ చేయొద్దు, జైలుకే పంపండి! మెడలో బోర్డుతో యూపీలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన దొంగ
- ఎన్ కౌంటర్ భయంతో వణుకుతున్న నేరస్థులు
- స్వచ్ఛందంగా స్టేషన్ కు వచ్చి లొంగిపోతున్న వైనం
- భవిష్యత్తులో నేరాల జోలికి వెళ్లబోమంటూ వేడుకోలు
ముజఫర్ పూర్ జిల్లాలోని బుధానా గ్రామానికి చెందిన అభినవ్ ఇటీవల ఓ దొంగతనం చేశాడు. మరో ఇద్దరితో కలిసి ఓ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి నుంచి రూ.2.75 లక్షలు ఎత్తుకెళ్లాడు. దీనిపై ఫతేపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అభినవ్ సహచరులు రాహుల్, సచిన్ లను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అభినవ్ కోసం వెతుకుతున్నట్లు ప్రకటించారు. అతడి ఆచూకీ చెబితే రూ.25 వేల రివార్డు ఇస్తామని ప్రకటించారు.
పోలీసుల ప్రకటనతో అభినవ్ వణికిపోయాడు. తనను ఎన్ కౌంటర్ చేస్తారేమోనని భయపడ్డాడు. వెంటనే తాను లొంగిపోతున్నానని, తనను అరెస్టు చేసి జైలుకు పంపించాలని, ఎన్ కౌంటర్ చేయొద్దని ఓ బోర్డు మెడలో వేసుకుని స్టేషన్ కు వెళ్లాడు. మరోసారి నేరాల జోలికి వెళ్లబోనంటూ పోలీసులను వేడుకున్నాడు. దొంగిలించిన సొమ్ములో ఖర్చుకాగా మిగిలిన రూ.40 వేలను పోలీసులకు అప్పగించాడు. అభినవ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని కోర్టులో హాజరు పరిచారు.