Advertisement

ఆఫీసుకు రావాల్సిందే... ట్విట్టర్ ఉద్యోగులకు తేల్చి చెప్పిన మస్క్

Musk emails Twitter employees Office is not optional
  • శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం సగం మేర ఖాళీగా కనిపించిన వైనం
  • సగం మంది ఉద్యోగులు ఆఫీసుకు డుమ్మా
  • తీవ్రంగా పరిగణించిన మస్క్
  • అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్
ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత ఎలాన్ మస్క్ విశ్వరూపం చూపిస్తున్నారు. కార్పొరేట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగులను హడలెత్తిస్తున్నారు. తాజాగా, ఆయన అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల సమయంలో ఉద్యోగులకు ఈమెయిల్ సందేశం పంపి మరోసారి కలకలం సృష్టించారు. 

ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందేనన్నది ఆ మెయిల్ సారాంశం. ఆఫీసుకు వచ్చి పనిచేయడంపై ఆప్షన్లు ఉండవని ఉద్యోగులకు తేల్చి చెప్పారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ కార్యాలయానికి ఇటీవల సగం మంది ఉద్యోగులు డుమ్మా కొట్టిన విషయాన్ని కూడా మస్క్ తన ఈమెయిల్ లో ప్రస్తావించారు. ఆ రోజున శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయం సగం మేర ఉద్యోగుల్లేక ఖాళీగా కనిపించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 

ట్విట్టర్ ను కొనుగోలు చేశాక మస్క్ చేసిన మొదటి పని, ఇప్పటికీ చేస్తున్నదీ... ఉద్యోగుల విషయంలో ప్రక్షాళనే. తన వద్ద పనిచేసే వారు కరడుగట్టిన ఉద్యోగుల్లా పనిచేయాలని మొదటి నుంచి చెబుతున్నారు. వారంలో కనీసం 40 గంటలు పనిచేయాల్సిందేనని గత నవంబరులో హుకుం జారీ చేశారు. దాంతో టార్గెట్లు అందుకోవడానికి కొందరు ట్విట్టర్ ఉద్యోగులు ఆఫీసుల్లోనే నిద్రిస్తున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. 

అంతేకాదు, వివిధ దేశాల్లోని ట్విట్టర్ కార్యాలయాల్లో ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఇంటికి సాగనంపారు. కొన్నిచోట్ల తగినంత మంది సిబ్బంది లేక ట్విట్టర్ ఆఫీసులు మూతపడ్డాయి.
Advertisement
Elon Musk
Twitter
Office
Employees
USA

More Telugu News