చిలుక సాక్ష్యంతో మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

Police busted woman murder case with a Parrot help
  • 2014లో ఆగ్రాలో మహిళ హత్య
  • పోలీసులకు చిక్కుముడిలా మారిన కేసు
  • నిందితుడ్ని పట్టించిన చిలుక
  • పోలీసుల ఎదుట నిందితుడి పేరు పలికిన చిలుక
ఉత్తరప్రదేశ్ లో ఓ మహిళ హత్య కేసును పోలీసులు చిలుక సాక్ష్యంతో ఛేదించారు. 2014లో ఆగ్రాలో నీలమ్ శర్మ అనే మహిళ హత్యకు గురైంది. నీలమ్ భర్త విజయ్ శర్మ తన కుమారుడితో కలిసి ఓ పెళ్లికి హాజరయ్యేందుకు ఫిరోజాబాద్ వెళ్లారు. ఆయన తిరిగొచ్చేసరికి భార్య నీలమ్ శర్మ రక్తపు మడుగులో పడి ఉంది. వారి పెంపుడు కుక్క కూడా రక్తంతో కూడిన గాయాలతో మరణించి కనిపించింది. 

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళ శరీరంపై 13 కత్తిపోట్లు, కుక్క శరీరంపై 9 కత్తిపోట్లు ఉన్నట్టు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే సంఘటన స్థలంలో ఆధారాలేమీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఈ హత్య ఓ చిక్కుముడిలా మారింది. 

అయితే, నీలమ్ శర్మ పెంపుడు చిలుక ఈ హత్య కేసు దర్యాప్తును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు సాయపడింది. అశు ఆయా తా (అశు వచ్చాడు)... అశు ఆయా తా (అశు వచ్చాడు) అని అరుస్తుండడంతో పోలీసులు ఈ అశు ఎవరని ఆరా తీశారు. అశు పూర్తిపేరు అశుతోష్ గోస్వామి. నీలమ్ శర్మకు మేనల్లుడు. ఆభరణాల కోసం అశుతోష్... రోనీ మాస్సీ అనే మరో వ్యక్తి సాయంతో నీలమ్ శర్మను హత్య చేసినట్టు విచారణలో గుర్తించారు. 

కాగా, చిలుక సాక్ష్యాన్ని తొలుత కోర్టు అంగీకరించలేదు. అయితే, నీలమ్ శర్మను హత్య చేసే సమయంలో ఆమె పెంపుడు కుక్క అశుతోష్, రోనీలపై దాడి చేసింది. ఈ దాడిలో అశుతోష్ కు కుక్క కాట్లు పడ్డాయి. అనంతరం వారు కుక్కను కూడా కత్తితో పొడిచి చంపేశారు. 

ఈ కేసు 9 ఏళ్ల పాటు విచారణ జరగ్గా, 14 మంది సాక్షులను విచారించారు. తుదకు చిలుక సాక్ష్యమే నిజమైంది. నీలమ్ శర్మను అశుతోష్, రోనీలే హత్య చేసినట్టు కోర్టు అందుబాటులో ఉన్న ఆధారాల మేరకు నిర్ధారించింది. ఒంటరిగా ఉన్న మహిళను నగల కోసం చంపారంటూ వారికి జీవితఖైదు విధించింది. కాగా, కరోనా సమయంలో నీలమ్ భర్త విజయ్ శర్మ మరణించినా, వారి కుమార్తెలు మాత్రం తల్లి హత్య కేసులో న్యాయం కోసం పట్టువదలకుండా పోరాడారు.
Go Back to Shorts
Neelam
Murder
Parrot
Police
Agra
Uttar Pradesh

More Telugu News