Wasin Akram: అప్పుడు చెన్నై ఎయిర్ పోర్టులో నా భార్య స్పృహ కోల్పోయింది.. నాకు కన్నీళ్లు ఆగలేదు: పాత ఘటనను గుర్తుకు తెచ్చుకున్న వసీం అక్రమ్

  • చెన్నైలో దిగడానికి తమకు ఇండియన్ వీసా లేదన్న వసీం 
  • కానీ ఎయిర్ పోర్ట్ సిబ్బంది, ఇమ్మిగ్రేషన్ అధికారులు సహకరించారని వెల్లడి 
  • తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లారని పేర్కొన్న వసీం   
  • భారతీయుల మనసు చాలా గొప్పదని కితాబు 
My Wife Was Unconscious Wasim Akram Shares old memory

పాకిస్థానీ దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ గురించి ఎవరికీ ఎలాంటి పరిచయం అక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి అయినప్పటికీ ఇండియాలో సైతం ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆయనకు కూడా భారత్ అంటే అమితమైన ప్రేమ ఉంది. తాజాగా 2009లో జరిగిన ఒక సంఘటనను ఆయన పంచుకుంటూ భారత్ గొప్పదనాన్ని కొనియాడారు. 

'2009లో నేను, నా భార్య (ఇప్పుడు లేరు. చనిపోయారు) సింగపూర్ కి వెళ్తున్నాం. ఫ్యూయల్ నింపుకోవడానికి విమానం చెన్నై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. ఆ సమయంలో నా భార్య తీవ్ర అస్వస్థతకు గురై, స్పృహ కోల్పోయింది. నాకు కన్నీళ్లు ఆగడం లేదు. ఫ్లైట్ నుంచి కిందకు దిగడానికి మాకు ఇండియా వీసా లేదు. పాకిస్థాన్ పాస్ పోర్టులు మాత్రమే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అయితే ఆ సమయంలో చెన్నై ఎయిర్ పోర్ట్, సెక్యూరిటీ, కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సిబ్బంది నాకు ధైర్యం చెప్పారు. వీసా గురించి ఆందోళన చెందొద్దని చెప్పి, నా భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లారు. నా జీవితంలో ఈ మానవతా ఘటనను మర్చిపోలేను. భారతీయుల మనసు చాలా గొప్పది' అని వసీం అక్రమ్ కొనియాడారు. 

1999లో జరిగిన చెన్నై టెస్టు గురించి మాట్లాడుతూ... చెన్నై టెస్ట్ తనకు చాలా స్పెషల్ అని చెప్పారు. తమకు ప్రధాన ఆయుధమైన రివర్స్ స్వింగ్ కు చెన్నై పిచ్ సరిగ్గా సరిపోతుందని అన్నారు. అప్పుడు తమ జట్టులో ఆ సమయంలో బెస్ట్ స్పిన్నర్లలో ఒకడైన సక్లైన్ ముస్తాక్ ఉన్నాడని... ఆయన వేసిన దూస్రాలకు ఎవరూ నిలబడలేకపోయారని చెప్పారు. ఫస్ట్ ఇన్నింగ్స్ తర్వాత సచిన్ బాగా ఆడాడని... సక్లైన్ వేస్తున్న దూస్రాలకు ల్యాప్ షాట్స్ ఆడుతూ స్కోరును పెంచాడని తెలిపారు. దూస్రాను ఆ విధంగా ఆడటం చాలా కష్టమని... కానీ, సచిన్ తన మాస్టర్ టెక్నక్ తో ఆ బంతులను అద్భుతంగా ఎదుర్కొన్నాడని... అందుకే సచిన్ ఆల్ టైమ్ గ్రేట్స్ లో ఒకడిగా నిలిచాడని ప్రశంసించారు.

More Telugu News