తుపాకీలో తూటా ఎలా లోడ్ చేయాలో మర్చిపోయిన ఉత్తరప్రదేశ్ ఎస్సై... వీడియో ఇదిగో!
- ఖలీలాబాద్ పీఎస్ లో తనిఖీ చేసిన ఎస్పీ
- ఓ రౌండ్ కాల్చాలంటూ ఎస్సైకి తుపాకీ ఇచ్చిన వైనం
- తూటా లోడ్ చేయలేక బిత్తరచూపులు చూసిన ఎస్సై
- తుపాకీ బ్యారెల్ లోంచి లోడ్ చేసేందుకు యత్నం
- ముందుకు జారి చేతుల్లోకి వచ్చిన తూటా
ఉత్తరప్రదేశ్ లోనూ ఓ ఎస్పీ ఖలీలాబాద్ పీఎస్ ను తనిఖీ చేయగా, అక్కడి సబ్ ఇన్ స్పెక్టర్ కనీసం తుపాకీలో తూటా లోడ్ చేయడం కూడా తెలియక నవ్వులపాలయ్యాడు. షాట్ గన్ ను ఆ ఎస్సై చేతికిచ్చిన ఎస్పీ ఓ షాట్ కాల్చాలని ఆదేశించారు. తూటా కూడా అందించారు.
తుపాకీ అందుకున్న ఎస్సై... తూటాను ఆ తుపాకీలో ఎక్కడ లోడ్ చేయాలో తెలియక దిక్కులు చూశాడు. చివరికి ఆ తూటాను తుపాకీ గొట్టం ముందు భాగంలోంచి లోడ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే తుపాకీ ముందుకు వంచగానే ఆ తూటా ముందుకు జారి చేతులోకి వచ్చేసింది. దాంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు. చివరికి ఆ సబ్ ఇన్ స్పెక్టర్ పరిస్థితి చూసి ఎస్పీకి కూడా నవ్వొచ్చింది.
దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ విమర్శనాస్త్రాలు సంధించింది. యోగి ప్రభుత్వం రాష్ట్ర పోలీసులకు ఏం నేర్పుతోందని ప్రశ్నించింది. పోలీసులు కనీసం తుపాకీ ఎలా కాల్చాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారంటూ ఎద్దేవా చేసింది.