Hetero: హెటెరో కొవిడ్ ఔషధానికి డబ్ల్యూహెచ్ఓ ప్రాథమిక అనుమతి

  • కొవిడ్ చికిత్సలో నోటి ద్వారా తీసుకునే ఔషధం పాక్స్ లోవిడ్
  • అభివృద్ధి చేసిన ఫైజర్
  • జనరిక్ వెర్షన్ ను తయారుచేస్తున్న హెటెరో
  • ప్రీక్వాలిఫికేషన్ అనుమతి నిచ్చిన డబ్ల్యూహెచ్ఓ
WHO prequalification for Hetero generic version for Paxlovid

నోటి ద్వారా తీసుకునే కొవిడ్ ఔషధం పాక్స్ లోవిడ్ ను ఫైజర్ ఫార్మా సంస్థ అభివృద్ధి చేయగా, దానికి జనరిక్ వెర్షన్ ను హెటెరో సంస్థ తయారుచేస్తోంది. ఇప్పుడీ జనరిక్ వెర్షన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రాథమిక అనుమతి నిచ్చింది. నిర్మాట్రెల్విర్, రిటోనావిర్ ల కలయికలో పాక్స్ లోవిడ్ ఔషధాన్ని తయారుచేశారు. 

ఈ ఔషధానికి డబ్ల్యూహెచ్ఓ ప్రపంచంలోనే తొలిసారిగా ప్రీక్వాలిఫికేషన్ అనుమతి తమకే ఇచ్చిందని హెటెరో వెల్లడించింది వ్యాక్సిన్లు తీసుకోనివారు, వృద్ధులు, ఇతర జబ్బులతో బాధపడుతున్నవారు, వ్యాధి నిరోధకశక్తి లేమితో బాధపడుతున్నవారు కొవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చేరాల్సిన దశలో ఉన్నప్పుడు ఈ ఔషధాన్ని వాడొచ్చని సిఫారసులు ఉన్నాయి. 

డబ్ల్యూహెచ్ఓ అనుమతి పొందడం ద్వారా పాక్స్ లోవిడ్ జనరిక్ వెర్షన్ ను వీలైనంత వేగంగా, భారత్ తదితర మధ్యస్థ ఆదాయ దేశాల్లో 95 శాతం తగ్గింపు ధరలతో అందుబాటులోకి తెచ్చేందుకు హెటెరోకు వెసులుబాటు కలగనుంది. ఈ ఔషధ ఉత్పాదనకు సంబంధించి హెటెరోకు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అత్యవసర వినియోగ అనుమతి కూడా లభించింది. 

కాగా, పాక్స్ లోవిడ్ జనరిక్ వెర్షన్ ను హెటెరో నిర్మాకామ్ పేరిట విక్రయాలు సాగించనుంది. ఈ ఔషధాన్ని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పైనే ఇస్తారు. కరోనా నిర్ధారణ అయిన రోగికి లక్షణాలు కనిపించిన ఐదు రోజుల్లోపు ఈ ఔషధాన్ని వాడాల్సి ఉంటుందని తెలుస్తోంది. హెటెరో గ్రూప్ ఎండీ డాక్టర్ వంశీకృష్ణ బండి స్పందిస్తూ... కొవిడ్ వ్యతిరేక పోరాటంలో తమ నిర్మాకామ్ ఔషధానికి డబ్ల్యూహెచ్ఓ ప్రీక్వాలిఫికేషన్ ఆమోదం లభించడం ఓ మైలురాయి వంటి పరిణామం అని పేర్కొన్నారు.

More Telugu News