సిరిసిల్ల కిడ్నాప్ వ్యవహారంలో భారీ ట్విస్ట్.. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు!
- ఈ తెల్లవారుజామున షాలిని కిడ్నాప్
- ఆమెను తీసుకెళ్లిన ప్రియుడు
- ఇద్దరూ పెళ్లి చేసుకున్నట్టు వీడియో విడుదల చేసిన షాలిని
తాను, జానీ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నామని... తన కోరిక మేరకే జానీ తనను తీసుకెళ్లాడని ఆమె తెలిపింది. జానీని తాను ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. తన తల్లిదండ్రులు తనకు పెళ్లిచూపులు చూస్తున్నారని, అందుకు జానీకి ఫోన్ చేసి తనను తీసుకెళ్లిపోవాలని చెప్పానని తెలిపింది. తనను తీసుకెళ్లే సమయంలో జానీ మాస్క్ ధరించాడని, అందుకే అతన్ని గుర్తుపట్టలేదని చెప్పింది. వచ్చింది జానీ అని తెలిసిన తర్వాత టెన్షన్ పోయిందని తెలిపింది. తమకు తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందని... పోలీసులు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా కోరుతున్నానని చెప్పింది.
వాస్తవానికి షాలిని, జానీ ఇద్దరూ ఏడాది క్రితమే పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆమెకు మైనార్టీ తీరలేదు. మరోవైపు ఈ పెళ్లిపై ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. ఈరోజుతో షాలిని మైనార్టీ తీరింది. ఇదే సమయంలో పెళ్లి సంబంధాలు చూస్తుండటంతో ఈ విషయాన్ని జానీకి ఆమె తెలిపింది. వచ్చి తీసుకెళ్లాలని కోరింది. దీంతో తెల్లవారుజామున మరో ముగ్గురితో కారులో వచ్చిన జానీ ఆమెను తీసుకెళ్లాడు. చివరకు ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకున్నారు. దీంతో కథ సుఖాంతం అయింది.