Mammootty: ఇంకోసారి అలా మాట్లాడను: క్షమాపణ కోరిన మమ్ముట్టి

  • డైరెక్టర్ జోసెఫ్ ను ప్రశంసిస్తూ మమ్ముట్టి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం
  • తలపై ఎక్కువ జుట్టు లేకపోయినా చాలా తెలివైనవాడు అని ప్రశంస
  • బాడీ షేమింగ్ చేశారంటూ నెటిజెన్ల విమర్శలు
Mammootty apologises after criticism

మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నారు. యువ దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. బాడీ షేమింగ్ చేశారంటూ మమ్ముట్టిపై నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్ జరుగుతుండటంతో... మమ్ముట్టి చివరకు ఫేస్ బుక్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ఇకపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. 

వివరాల్లోకి వెళ్తే, జోసెఫ్ తెరకెక్కించిన తాజా చిత్రం '2018' ట్రైలర్ ను మమ్ముట్టి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జోసెఫ్ తలపై ఎక్కువ జుట్టు లేకపోవచ్చు కానీ, ఆయన చాలా తెలివైనవాడు అని ప్రశంసించాడు. ఈ వ్యాఖ్యలే వివాదానికి కారణమయ్యాయి. కొందరు ఈ వ్యాఖ్యలను నెగెటివ్ గా తీసుకున్నారు. జోసెఫ్ ను మమ్ముట్టి బాడీ షేమింగ్ చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో, జోసెఫ్ ను ప్రశంసిస్తూ తాను చేసిన వ్యాఖ్యలు కొందరిని బాధించాయని, తన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని మమ్ముట్టి అన్నారు. ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడతానని చెప్పారు. 

మరోవైపు మమ్ముట్టికి మద్దతుగా జోసెఫ్ కూడా ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తనకు ఎక్కువ జుట్టు లేకపోవడం వల్ల తాను కానీ, తన కుటుంబ సభ్యులు కానీ బాధపడటం లేదని అన్నారు. మమ్ముట్టి వ్యాఖ్యలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. తన హెయిర్ లాస్ పట్ల ఎవరైనా నిజంగా ఆందోళన చెందుతుంటే... షాంపూ కంపెనీలు, నీటిని సరఫరా చేస్తున్న బెంగళూరు కార్పొరేషన్ కు వ్యతిరేకంగా గళాన్ని వినిపించాలని సూచించారు.

More Telugu News