వరుసగా 9వ నెల కూడా రూ.1.40 లక్షల కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

Center releases November month GST collections
  • నవంబరు మాసం వివరాలు తెలిపిన కేంద్రం
  • గత నవంబరుతో పోల్చితే 11 శాతం అధికం
  • అయితే ఈ ఏడాది ఆగస్టు నుంచి ఇదే అత్యల్పం
గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వసూళ్లకు సంబంధించిన నవంబరు మాసం వివరాలను కేంద్రం వెల్లడించింది. నవంబరు మాసంలో రూ.1.45 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైందని తెలిపింది. గతేడాది నవంబరులో వసూలైన జీఎస్టీ కంటే ఇది 11 శాతం అధికం. 

వరుసగా 9వ నెల కూడా జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్ల మార్కును దాటడం విశేషం. అయితే గత ఆగస్టు నుంచి చూస్తే ఈ నవంబరులో వసూలైన జీఎస్టీ అతి తక్కువ. అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు రూ.1.52 లక్షల కోట్ల మార్కును తాకాయి. భారత జీఎస్టీ చరిత్రలో ఇదే రెండో అత్యధికం. 

నవంబరు మాసం జీఎస్టీ వసూళ్ల వివరాలు చూస్తే... కేంద్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (సీజీఎస్టీ) రూ.25,681 కోట్లు, రాష్ట్ర గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఎస్జీఎస్టీ) రూ.32,651 కోట్లు, సమీకృత గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (ఐజీఎస్టీ) రూ.77,103 కోట్లు (దిగుమతులపై రూ.38,635 కోట్లతో కలిపి), సెస్ రూపేణా వసూలైన మొత్తం రూ.10,433 కోట్లు (దిగుమతులపై రూ.817 కోట్లతో కలిపి) అని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Go Back to Shorts
GST
November
Collections
India

More Telugu News