ఉక్రెయిన్ సరిహద్దుల్లోని పోలండ్ గ్రామంపై క్షిపణి దాడి
- ఇద్దరు గ్రామస్తులు మృతి
- రష్యా పనేనని అనుమానాలు
- నాటో దేశాల హై అలర్ట్
- జీ20 దేశాల అత్యవసర భేటీ
క్షిపణి దాడిపై పోలండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. దాడి వివరాలతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులకు కూతవేటు దూరంలోని ప్రజ్వోడో గ్రామంలో క్షిపణి పడిందని అందులో పేర్కొంది. గ్రామానికి చెందిన ఇద్దరు పౌరులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. ఆ క్షిపణి రష్యాలో తయారైందేనని ప్రాథమిక ఆధారాలు దొరికాయని వివరించింది. అయితే, ఆ క్షిపణిని తమపైకి ఏ దేశం ప్రయోగించిందనే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేదని పోలండ్ ప్రెసిడెంట్ ఆండ్రెజెజ్ డుడా తెలిపారు.
ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా.. లేక పొరపాటున తమ దేశంపై పడిందా అనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. కాగా,సదరు క్షిపణి రష్యాలో తయారైందని గుర్తించిన వెంటనే తమ దేశంలోని రష్యా రాయబారికి నోటీసులు పంపినట్లు అంతకుముందు పోలండ్ విదేశాంగ శాఖ తెలిపింది.