Siddhaanth Vir Surryavanshi: వ్యాయామం చేస్తూ జిమ్‌లోనే కుప్పకూలి మరణించిన టీవీ నటుడు సిద్ధాంత్

Actor Siddhaanth Vir Surryavanshi dies collapses in gym
షార్ట్స్‌లో చూడండి
వ్యాయామాలు ప్రాణాలు తీస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ మృత్యువాత పడుతున్నవారి జాబితా పెరుగుతోంది. తాజాగా ముంబైకి చెందిన ప్రముఖ టీవీ నటుడు సిద్ధాంత్ వీర్ సూర్యవంశీ (46) హఠాన్మరణం చెందారు. నిన్న జిమ్‌లో వ్యాయామం చేస్తూ ఉన్నట్టుండి ఆయన కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే ఆయనను కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు నిర్థారించారు. వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతోనే ఆయన మరణించి ఉండొచ్చని వైద్యులు ఆయన కుటుంబ సభ్యులకు తెలిపారు.

సూర్యవంశీకి భార్య అలేసియా రౌత్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుసమ్, కసౌటీ జిందగీ కే, జిద్దీ దిల్ మానేనా వంటి పలు షోలతో సిద్ధాంత్ ఎంతోమందికి చేరువయ్యారు. కాగా, జిమ్‌లో వ్యాయామం చేస్తూ మృత్యువాత పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల పలువురు ప్రముఖులు ఇలానే ప్రాణాలు కోల్పోయారు. 

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కూడా ఇలానే జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ గుండెపోటుకు గురై మృతి చెందారు. అలాగే, సిద్ధార్థ్ శుక్లా, బ్రహ్మస్వరూప్ మిశ్రా, దీపేశ్ భాను వంటివారు ప్రాణాలు కోల్పోయారు. ప్రముఖ హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ (58) కూడా ఇలానే మృతి చెందారు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఇలానే జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.
Go Back to Shorts
Siddhaanth Vir Surryavanshi
Mumbai
Kasautii Zindagi Kay

More Telugu News