డీజిల్ వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశిస్తే.. 20 వేల జరిమానా!
- వాయు కాలుష్యం కట్టడికి ఆప్ సర్కారు నిర్ణయం
- నిత్యావసర వస్తువులను తరలించే వాహనాలకు మినహాయింపు
- అనవసర ప్రయాణాలు మానుకోవాలంటూ ప్రజలకు మంత్రి విజ్ఞప్తి
ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు సీఎన్ జీ వాహనాల రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అదేవిధంగా, అత్యవసర వస్తువులను సరఫరా చేసే వాహనాలకూ ఆంక్షలు వర్తించవని వివరించారు. బీఎస్ 3 పెట్రోల్, బీఎస్ 4 డీజిల్ వాహనాలకు మాత్రం ఢిల్లీలోకి ఎంట్రీ లేదని స్పష్టం చేశారు. ప్రజా రవాణా కోసం 1000 సీఎన్ జీ బస్సులను అద్దెకు తీసుకోనున్నట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.
ఢిల్లీలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ చెప్పారు. కాలుష్య నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అదే సమయంలో నిత్యావసర వస్తువులను తరలించే వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని, బయటకు వెళ్లాల్సి వస్తే ప్రజా రవాణా సదుపాయాలను ఉపయోగించుకోవాలని ప్రజలకు మంత్రి కైలాష్ విజ్ఞప్తి చేశారు.