Munugode: మునుగోడులో ప్రచారానికి రేపటితో తెర... సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయకూడదన్న ఎన్నికల సంఘం

  • మునుగోడులో నవంబరు 3న ఉప ఎన్నిక
  • నవంబరు 1 సాయంత్రం 6 గంటల వరకే ప్రచారం
  • ఆ తర్వాత ప్రచారం చేస్తే చర్యలు ఉంటాయన్న ఎన్నికల సంఘం
Election campaign in Munugode will be stopped tomorrow

మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ నవంబరు 3న జరగనుండగా, రేపటితో ప్రచార పర్వానికి తెరపడనుంది. దీనిపై తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్ మీడియాకు వివరాలు తెలిపారు. ఎన్నికల ప్రచారం రేపు (నవంబరు 1) సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని, ఆ తర్వాత సాధారణ ప్రచారమే కాదు, సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేయరాదని స్పష్టం చేశారు. 

ప్రచార సమయం ముగిసిన తర్వాత స్థానికంగా ఓటు హక్కు లేనివాళ్లు ఎవరూ మునుగోడులో ఉండకూడదని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రచారం రేపటితో ముగుస్తుందని, అయినప్పటికీ ఎవరైనా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం అందితే చర్యలు ఉంటాయని వికాస్ రాజ్ వెల్లడించారు. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు. 

కాగా, మునుగోడు నియోజకవర్గంలో ఇప్పటిదాకా 185 కేసులు నమోదు చేశామని అన్నారు. రూ.6.80 కోట్ల నగదు, 4,683 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. రాజకీయ పార్టీల నేతలు, ఇతరుల నుంచి అందిన ఫిర్యాదుల సంఖ్య 479 అని తెలిపారు.

More Telugu News