లైకా ప్రొడక్షన్స్ తో రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఓకే చెప్పిన రజనీకాంత్
- లైకాతో రజనీ భారీ డీల్
- నవంబరు 5న పూజా కార్యక్రమాలు
- ప్రస్తుతం 'జైలర్' సినిమా చేస్తున్న రజనీ
లైకా ప్రొడక్షన్స్ హెడ్ తమిళ్ కుమరన్ దీనిపై స్పందిస్తూ, రజనీతో తాము రెండు సినిమాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ రెండు చిత్రాల ప్రారంభోత్సవం నవంబర్ 5న చెన్నైలో జరుగుతుందని వివరించారు. ఈ మేరకు తమిళ్ కుమరన్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ లో లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్, డిప్యూటీ చైర్మన్ ప్రేమ్ శివసామి కూడా పాల్గొన్నారు.
లైకా ప్రొడక్షన్స్ ఇటీవలే 'పొన్నియిన్ సెల్వన్' చిత్రాన్ని నిర్మించడం తెలిసిందే. పొన్నియిన్ సెల్వన్-2, భారతీయుడు-2 సినిమాలు ఈ బ్యానర్లోనే రానున్నాయి. అటు, రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నెల్సన్ కుమార్ దర్శకుడు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కన్నడ హీరో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
'జైలర్' సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్ లో సినిమాలను రజనీ పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలకు సంబంధించిన వివరాలను లైకా వర్గాలు త్వరలోనే ప్రకటించనున్నాయి.