పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబు.. స్టేషన్లో వందేమాతరం ఆలపిస్తూ మార్చ్ఫాస్ట్!
- బీహార్లోని సోసరాయ్లో ఘటన
- మూడు గంటలపాటు నానా హంగామా చేసిన తాగుబోతు
- కుటుంబ సభ్యులను పిలిపించి నిమ్మరసం ఇచ్చినా లేని ఫలితం
- చివరికి సెల్లో వేసిన పోలీసులు
బీహార్లో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ నిత్యం మద్యం కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల నుంచి మద్యం తెచ్చుకుని తాగుతున్న ఘటనలు అక్కడ కొత్తకాదు. ఇక, తాజా విషయానికి వస్తే ఆ యువకుడి పేరు సురేంద్ర ప్రసాద్. అర్ధరాత్రి వేళ తాగి ఊగుతున్న అతడిని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
అప్పటికే పూర్తి మద్యం మత్తులో ఉన్న సురేంద్ర ప్రసాద్ పోలీస్ స్టేషన్కు రాగానే అక్కడున్న వస్తువులను విసిరివేయడం ప్రారంభించాడు. దాదాపు మూడు గంటలపాటు స్టేషన్లోని పోలీసులకు చిరాకు తెప్పించాడు. వందేమాతరం పాడుతూ, మార్చ్ఫాస్ట్ చేస్తూ పోలీసులను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. చివరికి ఇలా కాదని చెప్పి పోలీసులు అతడి కుటుంబాన్ని పిలిపించారు. వారొచ్చి అతడి మత్తు దించేందుకు నిమ్మరసం పట్టారు. అయితే, ఆ ప్రయత్నం కూడా విఫలం కావడంతో రాత్రంతా అతడిని సెల్లో ఉంచినట్టు పోలీసులు తెలిపారు.