Harshakumar: అది వైసీపీ చేయిస్తున్న బలవంతపు ఉద్యమం.. ఉత్తరాంధ్ర ప్రజలకు ఆ కోరిక లేదు: హర్షకుమార్

  • వైసీపీ నేతలు కూడా విశాఖ రాజధానిని కోరుకోవడం లేదు
  • సీఎం జగన్ వారితో రాజీనామాలు చేయిస్తున్నారన్న కాంగ్రెస్ నేత
  • ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై మాట్లాడని వారు రాజధాని కోసం అంటే ప్రజలు నమ్మరన్న వైనం
  • ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెడతారన్న హర్షకుమార్
Congress leader Harshakumar slams jagan and kcr

ఏపీకి మూడు రాజధానులపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. నిజానికి ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని కావాలన్న కోరిక లేదన్నారు. విశాఖకు రాజధాని అంటూ చేయిస్తున్నది వైసీపీ నేతలు చేయిస్తున్నబలవంతపు ఉద్యమమని అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరిస్తామంటే విశాఖ ప్రజలు స్పందించారని, కానీ రాజధాని కోసం ఎవరూ స్పందించడం లేదని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రమే కాదని, వైసీపీ నేతలు కూడా విశాఖకు రాజధానిని కోరుకోవడం లేదన్నారు. విశాఖకు రాజధాని కావాలని మూడేళ్లుగా రాజీనామా చేయని నేతలు ఇప్పుడే ఎందుకు చేస్తున్నారని హర్షకుమార్ ప్రశ్నించారు.

వాస్తవంగా చెప్పాలంటే నేతలు తమంతట తాము రాజీనామా చేయడం లేదని, ముఖ్యమంత్రి జగన్ వారితో ఆ పని చేయిస్తున్నారని అన్నారు. విశాఖ రైల్వే జోన్, ప్రత్యేక హోదాపై పెదవి విప్పనివారు మూడు రాజధానుల గురించి రాజీనామా చేస్తున్నామంటే ప్రజలు నమ్మబోరన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే ఒక్కరాజధానికి కట్టుబడి ఉందని, నాన్ పొలిటికల్ జేఏసీతో తాము కలిసేది లేదని హర్షకుమార్ తేల్చి చెప్పారు. పనిలో పనిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా హర్షకుమార్ విరుచుకుపడ్డారు. ఆయనేదో పెద్ద సంస్కరణవాదిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టిన కేసీఆర్ జాతీయ పార్టీ ఎలా పెట్టారని నిలదీశారు. కేసీఆర్ లాంటి సంకుచిత భావాలున్న నేత రాణించిన దాఖలాలు దేశ చరిత్రలోనే లేవని హర్షకుమార్ పేర్కొన్నారు.

More Telugu News