Andhra University: డయాబెటిస్ పరీక్ష కోసం సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించిన ఆంధ్రా యూనివర్సిటీ

  • టైప్-2 డయాబెటిస్ ను సెకనులో గుర్తించే పరికరం
  • ఒక్క రక్తపు చుక్కతో ఫలితాలు
  • బయో ఫ్యాబ్రికేషన్ తో టెస్టింగ్ స్ట్రిప్ తయారీ
  • ఆరు నెలల పాటు స్ట్రిప్ ను ఉపయోగించుకునే వెసులుబాటు
Andhra University develops new testing kit for diabetes

ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు మధుమేహంతో బాధపడేవారి సంఖ్య చాలా పెరిగింది. కారణాలు ఏవైనప్పటికీ, ఒక్కసారి షుగర్ బారినపడితే జీవితకాలం మందులు వాడకతప్పదు. డయాబెటిస్ ను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది ప్రాణాంతకంగా పరిణమిస్తుంది. అందుకు షుగర్ రోగులు క్రమం తప్పకుండా టెస్టు చేయించుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే, మధుమేహ పరీక్ష కోసం ఉపయోగించే పరికరాలు కాస్త ఖర్చుతో కూడుకున్నవే. 

ఈ నేపథ్యంలో, విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ పరిశోధకులు సరికొత్త పరికరాన్ని ఆవిష్కరించారు. దీని సాయంతో టైప్-2 డయాబెటిస్ ను చిటికెలో తెలుసుకోవచ్చు. పైగా ఈ పరికరం అత్యంత చవకైనది. ఈ పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆంధ్రా యూనివర్సిటీ బయో కెమిస్ట్రీ విభాగం రూపొందించింది. ప్రొఫెసర్ పూసర్ల అపరంజి నేతృత్వంలో ఈ పరికరాన్ని అభివృద్ధి చేశారు. 

ఇది చూడ్డానికి ఓ పెన్ డ్రైవ్ లా కనిపిస్తుంది. ఇందులో వినియోగించే టెస్టింగ్ స్ట్రిప్ లను బయో ఫ్యాబ్రికేషన్ తో తయారుచేశారు. తద్వారా వీటిని 6 నెలల పాటు ఎన్నిసార్లయినా వాడుకోవచ్చు. ఒక్క రక్తపు చుక్కతో సెకను వ్యవధిలో ఫలితాలు వెల్లడవుతాయి. అంతేకాదు, ఈ పరికరాన్ని ఫోన్ లేదా ల్యాప్ టాప్ కు అనుసంధానం చేసుకోవచ్చు. అప్పుడు షుగర్ టెస్టు వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. 

కాగా, ఈ షుగర్ టెస్టు పరికరం టెక్నాలజీపై ఆంధ్రా యూనివర్సిటీ పేటెంట్ కూడా పొందింది. అంతేకాదు, దీన్ని వాణిజ్య ప్రాతిపదికన ఉత్పత్తి చేసేందుకు విశాఖకు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది.

More Telugu News