పనసపొట్టుతో మధుమేహానికి చికిత్స.. శ్రీకాకుళం ప్రభుత్వ వైద్య విజ్ఞాన సంస్థ అధ్యయనంలో గుర్తింపు
- రోజూ 30 గ్రాముల పచ్చి పనసపొట్టు తీసుకుంటే షుగర్ స్థాయులు అదుపులో ఉంటాయని గుర్తింపు
- పరిశోధన వివరాలను మీడియాకు వెల్లడించిన జాక్‌ఫ్రూట్ 365 సంస్థ
- పనసలోని అధిక ఫైబర్ వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని వివరణ
రెండు గ్రూపులుగా చేసి అధ్యయనం..
- 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండి.. మధుమేహానికి మందులు వాడుతున్నవారిపై శ్రీకాకుళం వైద్య విజ్ఞాన సంస్థ వైద్యులు పరిశోధన చేశారు.
- మొత్తం 40 మందిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక గ్రూప్ లోని వారికి రోజూ 30 గ్రాముల పచ్చి పనసపొట్టు పిండిని 12 వారాలు అందించారు. మరో గ్రూప్ లోని వారికి ఇదే బరువున్న ఇతర పిండి తరహా పదార్థాన్ని అందించారు.
- ఈ 12 వారాల సమయంలో వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయులు, పీపీజీ, కొవ్వుల స్థాయులు, బరువు పెరుగుతున్నారా, ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా? వంటివి పరిశీలించారు. మొత్తంగా పనస పొట్టు పిండిని వాడినవారిలో మధుమేహం బాగా నియంత్రణలో ఉన్నట్టు గుర్తించారు.
- ప్రపంచవ్యాప్తంగా కూడా పనస ప్రయోజనాలపై పలు పరిశోధనలు ఉన్నాయి. అమెరికన్ పరిశోధకులు కూడా పనస మధుమేహాన్ని నియంత్రించేందుకు పనిచేస్తుందని ప్రతిపాదించాయి.
- ఎలాంటి రసాయనాలు, పురుగు మందులూ అవసరం లేకుండా ఇవి పండుతాయి. పైగా వీటిలో విటమిన్ ఏ, సి, బి6తోపాటు కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు తోడ్పడుతాయి.
- ఇక పనస తొనలను తరచూ తీసుకోవడం వల్ల కంటిచూపు కూడా మెరుగ్గా ఉంటుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. పనసలోని పోషకాలు మన చర్మం, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండటానికి దోహదం చేస్తాయి.
- ఇక పనసలో అధికంగా ఉండే ఫైబర్ మన జీర్ణ వ్యవస్థను శుభ్రం చేస్తుంది. మలబద్ధకం, అల్సర్లు వంటి సమస్యలను తగ్గిస్తుంది.