ఢిల్లీలో ఈసారి కూడా దీపావళిని నిశ్శబ్దంగా జరుపుకోవాల్సిందే!
- ఢిల్లీలో ఆందోళనకర స్థాయిలో వాయు కాలుష్యం
- దీపావళి సమయంలో టపాసులపై నిషేధం విధించిన ఢిల్లీ సర్కార్
- టపాసులు పేల్చితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
టపాసులపై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. జవనరి 1వ తేదీ వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఆయన చెప్పారు. ఈసారి టపాసుల ఆన్ లైన్ విక్రయాలపై కూడా నిషేధం విధించామని తెలిపారు. అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నామని చెప్పారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి నిషేధం విధించక తప్పదని ఆయన అన్నారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా టపాసులను పేల్చితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు, టపాసులపై నిషేధం విధించడంతో పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.