Jayalalithaa: జయలలిత మేనకోడలు దీప ఆత్మహత్యాయత్నం?

  • జయలలిత వారసురాలిగా తెరపైకి దీప
  • భర్తతో మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు యత్నించినట్టు వార్తలు
  • అదేం లేదన్న భర్త మాధవన్
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దీప
Did Deepa commit suicide

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప గుర్తున్నారా? జయ మృతి తర్వాత ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన దీప.. జయలలితకు అసలు సిసలైన వారసురాలిని తానేనంటూ కోర్టుకెక్కారు. జయ వారసులమంటూ ఎంతోమంది బయటకు వచ్చినా.. దీప మాత్రమే నిలబడగలిగారు. జయ సోదరుడి కుమార్తె అయిన దీప, కుమారుడు దీపక్‌లను మద్రాస్ హైకోర్టు వారసులుగా ప్రకటించింది. దీంతో ఆమెకు రూ.1000 కోట్లకు పైగా ఆస్తులు దక్కాయి.

ఇదిలా ఉండగా, దీప తాజాగా ఆత్మహత్యకు యత్నించినట్టు వార్తలు వచ్చాయి. తీవ్ర అస్వస్థతకు గురైన దీపను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. భర్త మాధవన్‌తో మనస్పర్థలు కారణంగానే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్టు చెబుతున్నారు. అయితే, మాధవన్ మాత్రం అలాంటిదేమీ లేదని కొట్టిపడేశారు. ఆమెను తాను చాలా బాగా చూసుకుంటున్నానని, ఆసుపత్రిలో చేర్చింది కూడా తానేనని చెబుతున్నారు. మందులు అధికంగా తీసుకోవడంతో దీప కొంత అస్వస్థతకు గురైందని, చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. కాగా, భర్తతో ఏర్పడిన మనస్పర్థలకు సంబంధించి దీప వాట్సాప్‌లో తీవ్ర పదజాలం ఉపయోగించి మెసేజ్ పెట్టినట్టు తెలుస్తోంది. అన్నాడీఎంకే వర్గాలు కూడా ఆమె ఆత్మహత్యకు యత్నించినట్టు చెబుతున్నాయి. అయితే, ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

More Telugu News