Twin towers: దేశంలోనే ఎత్తయిన జంట నిర్మాణాలు.. కూల్చివేతకు ముహూర్తం ఖరారు

  • నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేతకు సుప్రీంకోర్టు ఆదేశాలు
  • ఆగస్ట్ 28 మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేత
  • 3,500 కిలోలకు పైగా పేలుడు పదార్థాల వినియోగం
Twin towers charged explosives to be connected across floors

నోయిడా సెక్టార్ 93-ఏ లోని సూపర్ టెక్ జంట టవర్లను (అపెక్స్, సియానే) వచ్చే ఆదివారం (ఆగస్ట్ 28) మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేయనున్నారు. చట్ట విరుద్ధంగా నిర్మించిన ఈ ఎత్తయిన భవనాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడం తెలిసిందే. ఈ జంట టవర్లు దేశంలోనే అత్యంత ఎత్తయినవి. వీటిల్లో 7,000 మంది నివసిస్తుండగా, 28న ఉదయం 7 గంటలకు వీరు తమ నివాసాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

ఈ జంట టవర్ల చుట్టుపక్కల ఉన్న చెట్లు దెబ్బతినకుండా ఉద్యానవన నిపుణుల బృందం రంగంలోకి దిగింది. కూల్చివేత సమయంలో దుమ్ము, ధూళి వచ్చి చెట్లపై పడకుండా వస్త్రాలను ఉపయోగిస్తోంది. భారీ నిర్మాణాలు కావడంతో వీటి కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున శబ్దం వస్తుందని భావిస్తున్నారు. అలాగే, ఏవైనా ప్రకంపనలు వస్తే సమీప ప్రాంతంలోని వారిని కాపాడేందుకు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అంబులెన్స్ లను సిద్ధంగా ఉంచుతారు. 

జంట టవర్లలో 3,500 కిలోల పేలుడు పదార్థాలు ఏర్పాటు చేశారు. ఈ కూల్చివేత ప్రక్రియను ముంబైకి చెందిన ఎడిఫైస్ ఇంజనీరింగ్ చేబట్టింది. 40 అంతస్తుల ఈ టవర్లలో 1,396 ఫ్లాట్స్ ఉన్నాయి. నిర్మాణ వ్యర్థాలను అక్కడి నుంచి తొలగించడానికి మూడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.

More Telugu News