Sunil Gavaskar: భారత క్రికెటర్లు ఐపీఎల్ దాటి రాకపోవడంపై గవాస్కర్ స్పందన

  • ఐపీఎల్ కే పరిమితమైన భారత క్రికెటర్లు
  • విదేశీ టీ20 లీగ్ లలో మనవాళ్లు కనిపించని వైనం
  • పలు దేశాల మాజీ క్రికెటర్ల విమర్శలు
  • వారి బాధ అర్థం చేసుకోదగినదేనన్న గవాస్కర్
Gavaskar opines on Indian cricketers now allowed to play foreign leagues

ఎక్కడెక్కడ్నించో వచ్చిన విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడడం చూస్తుంటాం కానీ, భారత క్రికెటర్లు మాత్రం విదేశీ లీగ్ లలో ఎక్కడా కనిపించరు. దీనిపై అనేక దేశాల మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. 

భారత క్రికెటర్లను బిగ్ బాష్ వంటి ఇతర లీగ్ లకు అనుమతించాలని పలువురు విదేశీ మాజీ క్రికెటర్లు చెబుతుంటారని, తద్వారా వారి దేశాల్లోని టీ20 లీగ్ లకు మరింత స్పాన్సర్ షిప్ రావాలని వారు కోరుకుంటూ ఉండొచ్చని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. వాళ్ల క్రికెట్ లీగ్ ల పరిస్థితి పట్ల వారు ఆందోళన వ్యక్తం చేయడం అర్థం చేసుకోదగినదేనని పేర్కొన్నారు. 

భారత క్రికెట్ విషయానికి వస్తే తమ ఆటగాళ్లు అలసట లేకుండా ఫ్రెష్ గా ఉండాలని, అంతర్జాతీయ మ్యాచ్ లకు ఉత్సాహంతో సిద్ధం కావాలని ఇక్కడి వ్యవస్థ భావిస్తుంటుందని, అందుకే ఇతర లీగ్ లలో ఆడేందుకు భారత క్రికెటర్లను నిరోధిస్తుంటుందని వివరించారు. 

అయితే క్రికెట్ లోని పాత శక్తులకు ఇదేమంతగా నచ్చడంలేదని అన్నారు. అద్భుతమైన సేవలు అందిస్తున్న భారత సహాయక సిబ్బందిని వదిలేసి కేవలం భారత ఆటగాళ్లనే తమ లీగ్ లలో ఆడాలని వారు కోరుకుంటున్నారని గవాస్కర్ విమర్శించారు. 

కాగా, త్వరలో ప్రారంభం కానున్న యూఏఈ టీ20 లీగ్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లలో భారత ఆటగాళ్లను అనుమతించవచ్చని, ఎందుకంటే ఆ రెండు లీగ్ లలో ఎక్కువ ఫ్రాంచైజీలు భారత సంస్థలకు చెందినవేనని తెలిపారు.

More Telugu News