రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ దుర్మరణం

  • ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న లక్ష్మణ్ యాదవ్
  • విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం
  • బైక్‌ను ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టిన వైనం
  • తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి
విశాఖపట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ యడ్ల లక్ష్మణ్‌యాదవ్(52) దుర్మరణం పాలయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. మధురవాడకు చెందిన లక్ష్మణ్‌యాదవ్ ఆర్టీసీ డ్రైవర్. జనసైనికుడిగా, ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్‌గా ఉన్నారు. నిన్న విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. 

ఈ క్రమంలో నగరంలోని జాతీయ రహదారిపై కొమ్మాది కూడలి వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఆయన బైక్‌ను ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై ఎగిరిపడిన ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. కొమ్మాది సిగ్నల్ వద్ద కుడివైపునకు తిరగాల్సిన ఆయన రెడ్ సిగ్నల్ పడడంతో వాహనాన్ని ఒక్కసారిగా నిలిపివేశారు. దీంతో వెనకనుంచి వస్తున్న లారీ వేగాన్ని నియంత్రించలేక ఆయన బైక్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

లక్ష్మణ్ యాదవ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఆయన మృతి విషయం తెలిసి చిరంజీవి అభిమానులు, జనసైనికులు, టీడీపీ, వైసీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళులు అర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Chiranjeevi
Laxman Yadav
Road Accident
Visakhapatnam

More Telugu News