తెలంగాణలో నేటి నుంచే ఎంసెట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణలో నేటి నుంచే ఎంసెట్ పరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

TS EAMCET 2022 Begins Today
  • నేటి నుంచి మూడు రోజుల పాటు ఇంజనీరింగ్ అర్హత పరీక్షలు
  • ప్రతి రోజు ఉదయం గం. 9-12, సాయంత్రం గం. 3-6 మధ్య రెండు సెషన్లలో పరీక్షలు
  • తెలంగాణ, ఏపీలో 108 కేంద్రాల ఏర్పాటు
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం అర్హత పరీక్షలు నేటి నుంచి జరుగుతున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో పరీక్షలు జరుగుతాయి. ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం గం. 9-12 మధ్య మొదటి సెషన్, మధ్యాహ్నం గం. 3-6 మధ్య మరో సెషన్ లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షల విషయంలో అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, రెండు గంటల ముందు నుంచే కేంద్రంలోకి అనుమతిస్తామని తెలిపారు.

మూడు రోజుల పాటు జరిగే పరీక్షలకు 1,72,241 మంది హాజరుకానున్నారు. వీరి కోసం 108 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎంసెట్ కన్వీనర్ డాక్టర్ ఎ.గోవర్దన్ తెలిపారు. తెలంగాణలో 89, ఆంధ్రప్రదేశ్ లో 19 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని చెప్పారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. 

విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి హాల్ టికెట్, గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు తీసుకురావాలని చెప్పారు. మొబైల్ ఫోన్లు, వాచీలు, కాలిక్యులేటర్ లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదన్నారు. కాగా, ఈ నెల 14, 15వ తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్, మెడికల్ విభాగం అర్హత పరీక్షలు భారీ వర్షాల కారణంగా వాయిదా వేశారు.
TS EAMCET
Telangana
exam
students

More Telugu News