కాస్త శాంతించిన గోదావరి.. ఇంకా ముంపులోనే లంక గ్రామాలు
- ధవళేశ్వరం వద్ద నదిలో తగ్గిన ప్రవాహం
- ఇంకా నీటిలోనే మునిగి ఉన్న విలీన మండలాలు
- కోనసీమలో ఏటిగట్ల పైనుంచి ప్రవహిస్తున్న గోదావరి నది.. ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
- గోదావరిలో వరద గణనీయంగానే ఉండటంతో విలీన మండలాలైన చింతూరు, కూనవరం, వీఆర్ పురం, ఏటపాక మండలాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. వారం రోజులుగా జల దిగ్బంధంలో ఉండటంతో జన జీవనం స్తంభించింది. పునరావాస కేంద్రాల్లో నీరు, విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నామని బాధితులు వాపోతున్నారు.
- వరద ప్రవాహం కారణంగా పలుచోట్ల ఏటిగట్లు ప్రమాదకరంగా మారాయని.. రాజోలులో ఆరు చోట్ల గట్టు బలహీనమైందని, పైనుంచి వరద ప్రవహిస్తోందని స్థానికులు చెప్తున్నారు. రాజోలు ప్రాంత జనం అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
గోదావరి నదిలో పోలవరం వద్ద గణనీయంగా ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం స్పిల్వే వద్ద 36.91 మీటర్లకు చేరగా.. 21 లక్షల క్యూసెక్కులకుపైగా నీటిని వదులుతున్నారు. ఎగువ కాఫర్ డ్యామ్ మునిగిపోయే స్థాయిలో వరద వస్తుందని భావించినా.. ఆ పరిస్థితి లేకపోవడంతో అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.