Sushant Singh Rajput: దివంగత సుశాంత్ సింగ్​ను డ్రగ్స్​కు బానిస చేసింది నటి రియానే.. అభియోగ పత్రంలో వెల్లడి!

  • డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తిపై ఎన్సీబీ అభియోగాలు
  • పలుమార్లు డ్రగ్స్ కొనుగోలు చేసి సుశాంత్ కు ఇచ్చినట్టు చార్జిషీట్లో వెల్లడి
  • ఈ కేసులో 35 మందిపై 38 అభియోగాల నమోదు 
NCB charges Rhea Chakraborty with abetting Sushant Singhs extreme drug addiction

బాలీవుడ్ నటి రియా చక్రవర్తి మళ్లీ చిక్కుల్లో పడింది. నటుడు, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ను డ్రగ్స్ కు బానిసను చేసింది రియానే అని వెల్లడైంది. సుశాంత్ కోసం నిషిద్ధ డ్రగ్స్ ను కొనుగోలు చేసి, అతడు విపరీతమైన మాదకద్రవ్యాల వ్యసనానికి బానిసయ్యేందుకు సహకరించినట్లు రియా చక్రవర్తిపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అభియోగాలు మోపింది. 

సుశాంత్ సింగ్ 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. అతని మరణంతో ముడిపడి ఉన్న డ్రగ్స్ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ ఈ కేసులో 35 మంది నిందితులపై మొత్తం 38 అభియోగాలను మోపింది. ఈ మేరకు నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద నమోదు చేసిన చార్జిషీట్ ను ఎన్సీబీ ప్రత్యేక కోర్టుకు అప్పగించింది.

ఇందులో సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు అయిన నటి రియా చక్రవర్తిపై అభియోగాలను పేర్కొంది. ‘ఈ కేసులో పదో నిందితురాలైన రియా.. నేర పూరిత కుట్ర లేదా మరేదైనా కారణం కోసం శామ్యూల్ మిరాండా, షోవిక్ చరోబర్తీ, దీపేష్ సావంత్ తదితరుల నుంచి అనేక సార్లు గంజాయి కొనుగోలు చేసింది. వాటిని నటుడు దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు అందజేసింది. వీటి కోసం 2020 మార్చి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో షోవిక్ కు డబ్బులు చెల్లించింది’ అని పేర్కొంది. దాంతో, ఎన్డీపీఎస్(1985) చట్టంలోని పలు సెక్షన్ల కింద రియా తప్పు చేసినట్టు గుర్తించినట్టు కోర్టుకు తెలిపింది. 
 
ఈ కేసులో నిందితులుగా ఉన్న మొత్తం 35 మంది 2020 మార్చి నుంచి డిసెంబర్ వరకు మాదక ద్రవ్యాలు సేకరించడం, కొనుగోలు చేయడం, అమ్మడం, రవాణా చేయడం, ముంబై నగరంలో బాలీవుడ్ సెలబ్రిటీలకు పంపిణీ చేయడం వంటి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని ఎన్సీబీ పేర్కొంది.

More Telugu News