Snake Island: ఉక్రెయిన్ లోని స్నేక్ ఐలాండ్ నుంచి వైదొలగిన రష్యన్ సేనలు

  • ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్ పై రష్యా దాడులు
  • మొదట్లోనే స్నేక్ ఐలాండ్ ను స్వాధీనం చేసుకున్న రష్యా
  • తాజాగా కీలక నిర్ణయం
  • ఐక్యరాజ్యసమితి కోసమేనని వెల్లడి
Russian troops leaves Snake Island

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభమయ్యాక మొదట వశం చేసుకున్న ప్రాంతాల్లో స్నేక్ ఐలాండ్ కూడా ఒకటి. ఇక్కడి ఉక్రెయిన్ సైనికులు తమ ప్రాణం పోయినా ఫర్వాలేదంటూ రష్యా బలగాలకు లొంగిపోయేందుకు నిరాకరించారన్న వార్త అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత స్నేక్ ఐలాండ్ భద్రతా సిబ్బందిని అదుపులోకి తీసుకున్న రష్యా... ఆ దీవిని తన అధీనంలోకి తీసుకుంది. 

తాజాగా, స్నేక్ ఐలాండ్ నుంచి రష్యా సేనలు వైదొలిగాయి. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. గురువారం నాడు తమ బలగాలు స్నేక్ ఐలాండ్ ను వీడినట్టు తెలిపింది. ఇది సుహృద్భావపూరిత చర్య అని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

ఐక్యరాజ్యసమితి చేపడుతున్న ఆహార సంక్షోభ నివారణ కార్యక్రమానికి విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతోనే తాము వెనక్కి తగ్గినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇగోర్ కొనాషెంకోవ్ వివరించారు. ఉక్రెయిన్ నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు అనువైన వాతావరణాన్ని ఏర్పరిచేందుకు ఐక్యరాజ్యసమితి చర్యలు తీసుకుంటోందని, అందుకు తాము సహకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. 

ప్రపంచ ఆహార సంక్షోభ నివారణ కోసం వివిధ నౌకాశ్రయాల ద్వారా జరుపుతున్న ఆహార ధాన్యాల ఎగుమతులను రష్యా అడ్డుకుంటోందని ఉక్రెయిన్, పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే రష్యా ఈ వాదనలను కొట్టిపారేస్తోంది. అంతేకాదు, నల్ల సముద్రం ప్రాంతంలో ఉక్రెయిన్ సీ మైన్స్ (సముద్ర మందుపాతరలు) ఏర్పాటు చేసిందని, ముందు వాటిని తొలగించాల్సిన అవసరం ఉందని రష్యా చెబుతోంది.

More Telugu News