జగన్ సంక్షేమ పథకాల నడి సముద్రంలో చిక్కుకున్నారు.. ఆయనను మీరే ఒడ్డుకు చేర్చాలి: ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి

  • భర్తలు వద్దన్నా మహిళలు మాత్రం తమకే ఓట్లేస్తారన్న చక్రపాణి
  • పార్టీకి వ్యతిరేకంగా వచ్చే పోస్టులపై అదే స్థాయిలో బదులివ్వాలని కార్యకర్తలకు సూచన
  • బీజేపీ విధానాల వల్లే ధరలు పెరిగాయన్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాల నడి సముద్రంలో చిక్కుకున్నారని, ఆయనను మీరే రక్షించి ఒడ్డుకు చేర్చాలని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ప్రజలను కోరారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో నిన్న నిర్వహించిన శ్రీశైలం నియోజకవర్గ వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి మహిళలు తమకే ఓటు వేస్తారని అన్నారు. భర్తలు వద్దన్నా వారి భార్యలు మాత్రం తమకు ఓట్లేసి గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 

సోషల్ మీడియాలో వైసీపీకి వ్యతిరేకంగా పోస్టులు వస్తే అదే స్థాయిలో మీరు కూడా పోస్టులు పెట్టాలని కార్యకర్తలకు చక్రపాణిరెడ్డి సూచించారు. బీజేపీ విధానాల వల్లే పెట్రోలు, గ్యాస్, నిత్యావసరాల ధరలు పెరిగాయని, అయినప్పటికీ ప్రతిపక్షాలు ఆ పార్టీని ఏమీ అనకుండా తమపై విమర్శలు చేస్తున్నాయని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Shilpa Chakrapani Reddy
Srisailam
YSRCP

More Telugu News