హస్సే వంటి గొప్ప క్రికెటర్ తో పోల్చడం ఆనందాన్నిస్తోంది: దేవాన్ కాన్వే
- ఢిల్లీ జట్టుపై సీఎస్కే గెలుపులో కాన్వే కీలక పాత్ర
- అతడ్ని మైక్ హస్సేతో పోలుస్తూ కామెంట్లు
- వీటిపై స్పందించిన సీఎస్కే ఓపెనర్
ఒక క్రికెటర్ గా హస్సేతో మాట్లాడడం, ఆయన నుంచి నేర్చుకోవడం, కష్టపడి పనిచేయడం తనకు ఎంతో ముఖ్యమైనదిగా దేవాన్ కాన్వే పేర్కొన్నాడు. ఆదివారం ఢిల్లీ జట్టును సీఎస్కే 91 పరుగుల తేడాతో ఓడించడం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు సాధించింది. ఇందులో ఓపెనర్ గా వచ్చిన దేవాన్ కాన్వే 49 బంతులను ఎదుర్కొని 87 పరుగులు సాధించాడు.
‘‘నాకు ఇచ్చిన ఏ అవకాశాన్ని అయినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని నన్ను నేను నిరూపించుకోవాలి. దక్షిణాఫ్రికాకు వెళ్లి వివాహం చేసుకుని రావడం నా అదృష్టం. ఈ సమయంలో జట్టు నుంచి నాకు లభించిన మద్దతుకు సంతోషంగా ఉంది’’ అని కాన్వే పేర్కొన్నాడు. ఏప్రిల్ లో కాన్వే వివాహం అతని గర్ల్ ఫ్రెండ్ కిమ్ వాట్సన్ తో జరిగింది. ఆ సమయంలో బయోబబుల్ నుంచి వెళ్లిన అతడు, వివాహం తర్వాత వచ్చి చేరాడు. ఓపెనర్ గా సత్తా చాటుతున్నాడు.