ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యరపతినేని అనుచరులు.. పల్నాడులో తీవ్ర ఉద్రిక్తత
- ఈ నెల 13న యరపతినేని బర్త్ డే
- పిగుగురాళ్లలో భారీ కటౌట్ పెట్టిన టీడీపీ శ్రేణులు
- తొలగించాలన్న మునిసిపల్ అధికారులు
- పోలీసులు, అనుచరుల మధ్య తోపులాట
ఈ నెల 13న యరపతినేని జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన అనుచరులు పిడుగురాళ్లలో ఆయన భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న పిడుగురాళ్ల మునిసిపల్ అధికారులు ఆ కటౌట్‌ను తొలగించాలని యరపతినేని అనుచరులకు ఆదేశాలు జారీ చేశారు. అందుకు యరపతినేని అనుచరులు ససేమిరా అన్నారు. దీంతో పోలీసు బలగాలతో కలిసి మునిసిపల్ అధికారులు కటౌట్‌ను తొలగించేందుకు యత్నించారు.
దీంతో అక్కడకు చేరుకున్న యరపతినేని అనుచరులు పోలీసులు, మునిసిపల్ అధికారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు, అధికారులను నిలువరించే యత్నంలో భాగంగా యరపతినేని అనుచరుల్లో కొందరు వ్యక్తులు ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. పోలీసులు వెనుదిరగకపోతే నిప్పు అంటించుకుంటామని హెచ్చరించారు. ఊహించని ఈ ఘటనతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.