Telangana: గవర్నర్ తమిళిసై రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తేనే గౌరవిస్తాం: తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి

  • తమిళిసై బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారన్న మంత్రి 
  • గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శ 
  • అందుకే సమస్యలు తలెత్తుతున్నాయన్న జగదీశ్ రెడ్డి  
telangana minister jagadish reddy fires on governor tamilisai

తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు మధ్య విభేదాలు రోజురోజుకు మరింత తీవ్రతరమవుతున్నాయి. తాజాగా, విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి గవర్నర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె గవర్నర్‌లా కాకుండా బీజేపీ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తేనే ఆమెను తాము గౌరవిస్తామని తేల్చి చెప్పారు.

సూర్యాపేటలో నిన్న విలేకరులతో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ వ్యవస్థను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, అందుకనే సమస్యలు వస్తున్నాయన్నారు.

సీఎంతో చర్చకు సిద్ధమని గవర్నర్ ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. గవర్నర్ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తే అసలు సమస్యే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సులను గవర్నర్ ఆమోదించాలే తప్ప అందుకు భిన్నంగా వ్యవహరించడం సరికాదన్నారు. రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన పదవిలో ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిని కేంద్ర ప్రభుత్వం ఎలా నియమిస్తుందని ప్రశ్నించారు. తమిళిసై గవర్నర్ హోదాలో పర్యటిస్తే స్వాగతిస్తామని, కానీ బీజేపీ నాయకురాలిగా వస్తే మాత్రం ప్రొటోకాల్ ఎందుకు పాటిస్తామని మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.

More Telugu News