Hollywood: నేను చేసింది క్షమించరాని నేరమే.. కానీ, అతడు నా భార్యను తూలనాడాడు: విల్ స్మిత్

Will Smith Apologized For Slapping Chris Rock
షార్ట్స్‌లో చూడండి
హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నిన్న జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమం సందర్భంగా స్మిత్ భార్యపై యాంకర్ క్రిస్ రాక్ కామెంట్ చేయడం.. క్రిస్ ను స్మిత్  లాగిపెట్టి కొట్టడం జరిగిపోయాయి. ఈ ఘటనపై ఆస్కార్ నిర్వాహకులతో పాటు చాలా మంది స్మిత్ పై చాలా విమర్శలు కురిపించారు. ఆస్కార్ కమిటీ చట్టపరమైన చర్యలకూ సిద్ధమైంది. 

ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ ఘటనకు స్మిత్ క్షమాపణలు కోరాడు. తన భార్య అనారోగ్య పరిస్థితిపై అనవసర జోకులు పేల్చడంతోనే క్రిస్ ను కొట్టానని వివరణ ఇచ్చాడు. 

‘‘నేను చేసింది అక్షరాలా తప్పే. అందుకు క్రిస్ కు క్షమాపణ చెబుతున్నా. దారి తప్పి ప్రవర్తించాను. నా చర్యలకు సిగ్గుపడుతున్నా. నేను చేసిన పనికి నన్ను తప్పుగా అనుకోవద్దు” అంటూ ఇన్ స్టాలో రాసుకొచ్చాడు. హింస ఏ రూపంలో ఉన్నా అది విషమేనని, వినాశకారి అని అన్నాడు. ఆస్కార్ అవార్డుల్లో తన ప్రవర్తన, చర్య క్షమించరానివన్నాడు. 

పనిలో భాగంగా నాపై జోకులేస్తే ఫర్వాలేదని, కానీ, క్రిస్ తన భార్య అనారోగ్య పరిస్థితిపై జోకులు వేయడం వల్లే కోపం వచ్చిందని, తట్టుకోలేక కొట్టానని విల్ స్మిత్ చెప్పుకొచ్చాడు. 

విల్ స్మిత్ భార్య పింకెట్ స్మిత్ జుట్టు మొత్తం రాలిపోయే ‘అలోపీసియా’ అనే వ్యాధితో బాధపడుతోంది. దాని వల్ల ఆమె జుట్టు బాగా రాలిపోయింది. దీంతో ఆమె ఆదివారం నిర్వహించిన ఆస్కార్ వేడుకలకు క్రాప్ చేయించుకుని వచ్చింది. 

అయితే, అవార్డుల కార్యక్రమం చివరి దశలో ఉండగా పింకెట్ స్మిత్ ను ఉద్దేశిస్తూ క్రిస్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ‘జీఐ జేన్ 2’ కోసం పింకెట్ సిద్ధమవుతున్నట్టుందిగా అంటూ ఫెళ్లున నవ్వాడు. ఈ క్రమంలోనే ఆగ్రహం పెల్లుబికిన స్మిత్.. వేదికపైకి వచ్చి క్రిస్ ను లాగి ఒక్కటిచ్చాడు. 

తన భార్య గురించి మాట్లాడడం ఆపాలంటూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి ఆస్కార్ వేడుకకు వచ్చిన వాళ్లందరికీ స్మిత్ క్షమాపణలు చెప్పాడు. క్రిస్ కు మాత్రం చెప్పలేదు. గుండు చేయించుకుని పోరాడే ఓ మహిళా సైనికురాలి కథే జీఐ జేన్ 2 సినిమా.
Go Back to Shorts
Hollywood
Will Smith
Chris Rock
Oscar Awards
Academy

More Telugu News