ఉక్రెయిన్ లో రష్యా జీవాయుధాలు ప్రయోగించే అవకాశం ఉంది: అమెరికా అనుమానం
- అమెరికాపై రష్యా తీవ్ర ఆరోపణలు
- ఉక్రెయిన్ లో జీవాయుధ అభివృద్ధి జరుగుతోందని ఆరోపణలు
- అమెరికా హస్తం ఉందని వెల్లడి
- రష్యా ఆరోపణలను ఖండించిన అమెరికా
- జీవాయుధ దాడికి రష్యా సన్నద్ధమవుతోందన్న అగ్రరాజ్యం
రష్యా అధినాయకత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి అబద్ధాలను ప్రచారం చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ అన్నారు. ఉక్రెయిన్ లో భయానక దాడులకు దిగేముందు తన చర్యలను సమర్థించుకోవడానికి అమెరికాపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తోందని నెడ్ ప్రైస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకీ కూడా ఇదేరకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రష్యా చేస్తున్న ఆరోపణలు అసంబద్ధమైనవని, చైనా అధికారులు కూడా ఇలాంటి కుట్ర సిద్ధాంతాలనే వినిపిస్తుండడం గమనించాలని పేర్కొన్నారు. రష్యా నోట జీవాయుధాల మాట వినిపించిన నేపథ్యంలో, ఉక్రెయిన్ లో ఆ మేరకు జీవాయుధాలు, రసాయన ఆయుధాలు ప్రయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయని, అన్ని దేశాలు రష్యాపై ఓ కన్నేసి ఉంచాలని జెన్ సాకీ పిలుపునిచ్చారు.