ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నిక‌లు.. మ‌రో ఎన్నిక‌కు రంగం సిద్ధం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగిసిన 5 రాష్ట్రాల ఎన్నిక‌లు.. మ‌రో ఎన్నిక‌కు రంగం సిద్ధం

ec releases schedule for 13 rajyasabha seats election
  • 6 రాష్ట్రాల్లోని 13 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు
  • 21న నోటిఫికేష‌న్‌, అదే రోజు నుంచి నామినేష‌న్లు
  • 24వ‌ర‌కు నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌కు గ‌డువు
  • 31న పోలింగ్‌, అదే రోజు ఓట్ల లెక్కింపు
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పాటు మ‌రో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీల‌కు జ‌రుగుతున్న ఎన్నిక‌లు సోమ‌వారంతో ముగిశాయి. ఈ ఎన్నిక‌లు ఇలా ముగిశాయో,లేదో.. మ‌రో కీల‌క ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధమైపోయింది. దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు సంబంధించి ఖాళీ కానున్న‌ 13 రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం సోమ‌వారం షెడ్యూల్ ప్ర‌క‌టించింది. 5 రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు మ‌రో మూడు రోజుల్లో రానుండగా.. రాజ్య‌స‌భ స్థానాల ఎన్నిక‌ల ఫ‌లితాలు మాత్రం ఈ నెలాఖ‌రుకు వెల్లడవుతాయి.  

దేశంలోని ఆరు రాష్ట్రాల్లోని 13 రాజ్య‌స‌భ‌ స్థానాల ఎన్నికలకు సోమ‌వారం ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది.. అసోంలో 2, హిమాచల్ ప్రదేశ్ లో 1, కేరళలో 3, నాగాలాండ్ లో 1, త్రిపురలో 1, పంజాబ్‌లో 5 రాజ్యసభ స్థానాలు.. ఇలా మొత్తం 13 రాజ్యసభ స్థానాలు ఏప్రిల్‌లో ఖాళీ కానున్న నేపథ్యంలో వీటిని ఆ లోగానే భ‌ర్తీ చేసేలా ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 

ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఈ నెల‌ 21న నోటిఫికేషన్‌ జారీ కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అవుతుంది. మార్చి 24న నామినేషన్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గడువు ఉంది. మార్చి 31న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Rajya Sabha
election commission

More Telugu News