ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్
- ముందస్తు బెయిలు దరఖాస్తును తిరస్కరించిన కోర్టు
- ఆ వెంటనే కస్టడీలోకి తీసుకున్న సీబీఐ
- ఎన్ఎస్ఈ రహస్య సమాచారాన్ని ‘యోగి’తో పంచుకున్నట్టు అభియోగాలు
2010-2015 మధ్య ఎన్ఎస్ఈలో అవకతవకలు జరిగినట్టు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) గుర్తించి బయటపెట్టిన తర్వాత ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఎన్ఎస్ఈకి సంబంధించిన రహస్య సమాచారాన్ని చిత్రా రామకృష్ణ 2014-16 మధ్య ఈ-మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తితో పంచుకున్నట్టు సెబీ గుర్తించింది. ఇందుకు సంబంధించి పూర్తి ఆధారాలను సేకరించింది.
ఈ కేసుకు సంబంధించి 2018లోనే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్ఎస్ఈ వ్యవస్థను ఓ స్టాక్ బ్రోకర్ తారుమారు చేసినట్టు అందులో ఆరోపించింది. స్టాక్ బ్రోకర్ సంజయ్ గుప్తాకు ఎన్ఎస్ఈ కో-లొకేషన్ సదుపాయానికి యాక్సెస్ కూడా ఉందని, ఫలితంగా గుప్తా సంస్థ ఓపీజీ సెక్యూరిటీ లిమిటెడ్ ఇతరుల కంటే ముందుగానే మార్కెట్ డేటాను యాక్సెస్ చేయడానికి వీలు కలిగిందని సీబీఐ ఆరోపించింది.