Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీలో తెలుగు బిగ్‌బాస్ షో.. నాగార్జున‌పై మండిప‌డ్డ సీపీఐ నారాయ‌ణ‌!

cpi narayana slams big boss show
  • ఆ షో ఓ అధికారిక వ్యభిచార గృహం
  • బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశాం
  • షోకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నాం
  • నాగార్జున వ్యాఖ్యాత‌గా చేయ‌డం సిగ్గుచేటన్న నారాయణ 
స్టార్ మాలో 5 సీజ‌న్‌లుగా ప్ర‌సార‌మైన తెలుగు బిగ్ బాస్ ప్రేక్ష‌కులను అల‌రించింది. నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ప్ర‌సారం కానుంది. దీంతో ఈ షోపై సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ మ‌రోసారి అభ్యంత‌రాలు తెలిపారు. ఆ షో ఓ అధికారిక వ్యభిచార గృహం అని ఆయ‌న మండిప‌డ్డారు. 

తాము బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా ఇప్పటికే లేఖలు రాశామ‌ని నారాయ‌ణ గుర్తు చేశారు. పోలీస్ స్టేష‌న్ లో కేసు పెడదామని తాము ప్రయత్నిస్తే తమ పరిధి కాదంటున్నారని అన్నారు. దీంతో తాము కోర్టులో కేసులు వేశామ‌ని చెప్పారు. ఇప్పుడు త‌మ పార్టీ ఆధ్వర్యంలో బిగ్‌ బాస్‌ షోకు వ్యతిరేకంగా డిజిటల్‌ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 

బిగ్‌బాస్ షో లోపల ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదని నారాయ‌ణ అన్నారు. 200 కెమెరాలు పెట్టాం అంటున్నారని, అయితే, అందులో ఏం జ‌రుగుతుందో అంతా ఎడిటింగ్‌తో తీసేస్తార‌ని చెప్పారు. ఈ షో ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నార‌ని ఆయ‌న నిల‌దీశారు. దాన్ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్‌ చేశారు. 

భ‌క్తి ర‌స చిత్రాల్లో న‌టించిన హీరో అక్కినేని నాగార్జున బిగ్‌బాస్ వంటి షోకు వ్యాఖ్యాత‌గా చేయ‌డం సిగ్గుచేటని ఆయ‌న మండిప‌డ్డారు. కాగా, గతంలోనూ బిగ్‌బాస్ షోపై నారాయ‌ణ మండిప‌డుతూ దాన్ని బ్యాన్ చేయాల‌ని డిమాండ్ చేసిన విష‌యం తెలిసిందే.
CPI Narayana
Bigg Boss
Nagarjuna

More Telugu News