ఉక్రెయిన్ బోర్డర్ పాయింట్లకు నడుచుకుంటూ వెళ్తున్న భారతీయులు.. కీలక హెచ్చరిక జారీ చేసిన ఇండియన్ ఎంబసీ!
- సమాచారం ఇవ్వకుండా బోర్డర్ పాయింట్లకు వెళ్లొద్దు
- అలా వెళ్తే సహాయం చేయడం కష్టతరంగా మారుతుంది
- పలు బోర్డర్ పాయింట్ల వద్ద పరిస్థితి బాగోలేదు
పరిస్థితులు దారుణంగా మారిపోయిన నేపథ్యంలో అక్కడున్న మన దేశ ప్రజలకు ఇండియన్ ఎంబసీ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఎంబసీ అధికారులతో సమన్వయం చేసుకోకుండా ఏ బోర్డర్ పోస్టుకు వెళ్లవద్దని సూచించింది. పలు బోర్డర్ చెక్ పాయింట్ల వద్ద పరిస్థితి బాగోలేదని తెలిపింది.
మన పౌరులను ఉక్రెయిన్ నుంచి తరలించేందుకు సరిహద్దు దేశాల ఎంబసీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. సమాచారం అందించకుండానే బోర్డర్ చెక్ పాయింట్లకు చేరుకున్న భారతీయులకు సహాయం అందించడం క్రమంగా మరింత కష్టతరంగా మారుతోందని చెప్పింది. ఈ నేపథ్యంలో ఎంబసీ అధికారులకు సమాచారం అందించకుండా బోర్డర్ పాయింట్లకు వెళ్లవద్దని సూచించింది.
ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. చాలా మంది బంకర్లలోకి వెళ్లిపోయారు. ఎంతోమంది సుదూరంగా ఉన్న బోర్డర్ పాయింట్లకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ఈ ప్రకటన చేసింది.