'ఇన్విట్'లలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను రాయితీలు.. బడ్జెట్ లో ప్రకటించే అవకాశం
- మూలధన లాభాల పన్ను తగ్గించాలి
- ఇన్వెస్టర్ల నుంచి వచ్చిన డిమాండ్
- సానుకూలంగా ఉన్న ప్రభుత్వం
మౌలిక రంగ సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంపై కేంద్రంలోని మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. భారత్ ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్న విషయం తెలిసిందే. ఇందుకు భారీగా నిధుల అవసరం ఉంటుంది. అందుకనే ఇన్విట్ వంటి సాధనాలకు పన్ను ప్రయోజనాలు కల్పిస్తే ఎక్కువ మంది పెట్టుబడులకు ముందుకు వస్తారని.. తద్వారా ప్రాజెక్టులకు నిధుల సమస్య ఉండదని సర్కారు అంచనా.
ప్రస్తుతం ఇన్విట్ లలో మూడేళ్లకు మించిన పెట్టుబడులపై లాభాలు వస్తే 10 శాతం దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించాలి. మూడేళ్లలోపు లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాలి. ఈ పన్నును గణనీయంగా తగ్గించాలని విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల నుంచి ప్రభుత్వానికి సూచనలు అందాయి. దీంతో రానున్న బడ్జెట్ లో ఈ దిశగా ప్రభుత్వం చర్యలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఇన్విట్ లు పంపిణీ చేసే డివిడెండ్ పైనా పన్ను తగ్గించాలన్న డిమాండ్ ఉంది. దీనిపైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమో చూడాలి.