బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌పై నీలినీడలు.. దౌత్య బహిష్కరణ జాబితాలో ఐదు దేశాలు
- ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా నాలుగు దేశాలు
- మానవహక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ తీరుకు నిరసనగానేనన్న కెనడా
- రేపో, మాపో ఫ్రాన్స్ కూడా నిర్ణయం
ఈ విషయంలో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, లిథువేనియా ఇలాంటి నిర్ణయమే తీసుకోగా, తాజాగా కెనడా కూడా ఆ దేశాల బాటలోనే నడిచింది. మానవ హక్కుల ఉల్లంఘన, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో తెలిపారు.
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌లో తమ దేశం తరపున అధికారులు కానీ, రాయబారులు కానీ పాల్గొనబోరని స్పష్టం చేశారు. అయితే, క్రీడాకారులు మాత్రం పాల్గొంటారని తెలిపారు. ఈ విషయాన్ని గత నాలుగు నెలలుగా పరిశీలిస్తున్నామని, భాగస్వామ్య దేశాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
ఇక కెనడా తాజా నిర్ణయంతో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన దేశాల సంఖ్య ఐదుకు పెరిగింది. కాగా, ఈ విషయంలో తాము కూడా త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని ఫ్రాన్స్ తెలిపింది.