పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన రీతిలో అబద్ధం చెప్పింది: సీఎం కేసీఆర్

CM KCR criticizes Center over fuel prices
  • ప్రగతి భవన్ లో కేసీఆర్ ప్రెస్ మీట్
  • కేంద్రంపై నిప్పులు చెరిగిన సీఎం
  • చమురు ధరలపై విమర్శనాస్త్రాలు
  • కేంద్రం ప్రజలను మోసం చేస్తోందని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. పెట్రో ధరల గురించి మాట్లాడుతూ... పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం అద్భుతమైన పద్ధతిలో అబద్ధం చెప్పిందని అన్నారు. బీజేపీ 2014లో అధికారంలోకి వచ్చిందని, అప్పటినుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర 105 డాలర్లకు మించలేదని తెలిపారు.

ఓసారి చమురు ధరలు కుప్పకూలి 30 డాలర్లకు కూడా పడిపోయిందని, బ్రెజిల్ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని, రష్యాలోనూ అలాంటి పరిస్థితే వచ్చిందని వివరించారు. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం అంతర్జాతీయంగా ధర పెరిగిందని అబద్ధాలు చెప్పిందని ఆరోపించారు. రాష్ట్రాల వాటా ఎగ్గొట్టేందుకు ట్యాక్సులు పెంచకుండా, దాన్ని సెస్ రూపంలోకి మార్చారని వివరించారు. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొడుతున్నారని, ఈ నేపథ్యంలో ఇవాళ ఏపీ చీఫ్ మినిస్టర్ ఏకంగా పత్రికా ప్రకటన ఇచ్చారని వెల్లడించారు.

"నాడు పెట్రోల్ ధర రూ.77 ఉంటే దాన్ని రూ.114 చేశారు. డీజిల్ ధర రూ.68 ఉంటే రూ.107 చేశారు. ఈ పెరుగుదల మొత్తం కేంద్రమే తీసుకుంటోంది. రాష్ట్రాల నోరుకొడుతున్నారు. ప్రజలకు అబద్ధాలు చెబుతూ, మోసం చేస్తూ భారం మోపుతున్నారు. దానికితోడు రాష్ట్రాలకు రావాల్సిన వాటా ఎగ్గొడుతున్నారు. ఇప్పుడు పలు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతో కంటితుడుపు చర్య కింద ఎక్సైజ్ సుంకం ఓ పది రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇదే ఓ ఘనకార్యం అన్నట్టు చెప్పుకుంటున్నారు. పెంచింది కొండంత, తగ్గించింది పిసరంత!

ఇంత మోసం చేసి, ఇప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గించాలని చెబుతున్నారు. తగ్గించకపోతే ధర్నాలు చేస్తామని బీజేపీ వాళ్లు అంటున్నారు. ఎవరు ధర్నాలు చేయాలి? మీరా? మేమా? ఇప్పుడు మేం డిమాండ్ చేస్తున్నాం... చమురు ధరలపై మొత్తం సెస్ ను కేంద్రం ఉపసంహరించుకోవాలి. ప్రజల మీద అంత ప్రేమే ఉంటే 2014 నాటి ధర రూ.77కే ఇవాళ కూడా ఇవ్వొచ్చు" అని స్పష్టం చేశారు.
Go Back to Shorts
CM KCR
Fuel Prices
Union Govt
BJP

More Telugu News