నొప్పితో విలవిల్లాడుతున్నా బ్యాటింగా?.. సీఎస్‌కే తీరుపై అశ్విన్ ఆగ్రహం
- సీఎస్‌కే యువ ఆటగాడు ఆయుష్ మాత్రే గాయంపై అశ్విన్ ఆగ్రహం
- గాయపడినా బ్యాటింగ్ కొనసాగించమనడంపై తీవ్ర విమర్శలు
- ఇది ఆటగాడి భవిష్యత్తుతో చెలగాటం ఆడటమేనన్న అశ్విన్
- సీఎస్‌కే మెడికల్ టీమ్ తీరును తప్పుపట్టిన వెటరన్ స్పిన్నర్
- హైదరాబాద్‌తో మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిన సీఎస్‌కే
శనివారం నాటి మ్యాచ్‌లో సీఎస్‌కే ఛేజింగ్ సమయంలో 18 ఏళ్ల ఆయుష్ మాత్రే అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే 5వ ఓవర్లో రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతడి కాలికి హ్యామ్‌స్ట్రింగ్ గాయమైంది. నొప్పితో కుంటుతూ నడుస్తున్న అతడి వద్దకు ఫిజియో వచ్చినా, అతడిని 'రిటైర్డ్ హర్ట్'గా వెనక్కి పంపలేదు. దీనిపై తన యూట్యూబ్ చానెల్‌లో స్పందించిన అశ్విన్ "నేను షాక్‌కు గురయ్యాను. ఆ కుర్రాడు సరిగ్గా నడవలేకపోతున్నాడు. అలాంటి వాడిని పరుగు తీయమని అడగడం దారుణం. ఒకవేళ అది గ్రేడ్-2 గాయమైతే అతడు ఆరు వారాలు ఆటకు దూరమవుతాడు. ఒక యువకుడి కెరీర్‌తో ఇలా ఆడుకుంటారా?" అని ప్రశ్నించాడు.
గతంలో దీపక్ చాహర్ వంటి ఆటగాళ్లు సీఎస్‌కేలో తరచూ గాయపడటాన్ని అశ్విన్ గుర్తుచేశాడు. ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను ఏడాది పొడవునా పర్యవేక్షించడంలో చెన్నై జట్టు విఫలమవుతోందని విమర్శించాడు. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. గాయపడిన తర్వాతి బంతికే భారీ షాట్‌కు యత్నించిన మాత్రే 30 పరుగుల వద్ద ఔటయ్యాడు.