వైసీపీని గద్దెదించి రాష్ట్రానికి మరమ్మతు చేయాల్సిన అవసరముంది: చంద్రబాబు

  • తాడేపల్లి నియోజకవర్గ నేతలతో చంద్రబాబు సమావేశం
  • పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారంటూ ప్రశంస
  • సంక్షేమం పేరుతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపణ
తాడేపల్లి నియోజకవర్గం నేతలతో ఈ రోజు మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు.. పరిషత్, స్థానిక సంస్థల ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించారంటూ అభినందించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సంక్షేమం పేరుతో వైసీపీ ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. అక్రమ కేసులు, బెదిరింపులతో ప్రశ్నించిన వారి గొంతులు నొక్కేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

బెదిరింపులకు టీడీపీ భయపడే రకం కాదన్నారు. రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి కక్ష సాధింపునే ఎజెండాగా పెట్టుకుందన్నారు. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని భయపెట్టాలని చూస్తున్నారని, అయితే అది జరిగే పని కాదని తేల్చిచెప్పారు. వైసీపీ  ప్రభుత్వాన్ని గద్దెదించి రాష్ట్రానికి మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.


More Telugu News