కాబూల్ పేలుళ్ల ఘటనలో 90కి పెరిగిన మృతుల సంఖ్య
- నిన్న పేలుళ్లతో దద్దరిల్లిన కాబూల్
- ఎయిర్ పోర్టు గేటు, హోటల్ వద్ద పేలుళ్లు
- తమ పనే అని ప్రకటించుకున్న ఐసిస్
- ప్రతీకారం తప్పదన్న బైడెన్
మృతుల్లో అమెరికా మెరైన్ కమాండోలు కూడా ఉండడం పట్ల పెంటగాన్ వర్గాలు ఈ ఘటనను జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి నిష్క్రమిస్తున్న తరుణంలో అమెరికా అధినాయకత్వాన్ని రెచ్చగొట్టే చర్యగా రక్షణ రంగ నిపుణులు ఈ పేలుళ్లను అభివర్ణిస్తున్నారు. ఈ ఘాతుకం తమ పనే అని ఐసిస్ ఇప్పటికే ప్రకటించుకుంది.
నిజానికి ఈ పేలుడు ఘటనపై అమెరికా నిఘా వర్గాలు ముందే అప్రమత్తం అయ్యాయి. ఘటనకు కొన్ని గంటల ముందే హెచ్చరికలు జారీ చేసినా ఫలితం లేకపోయింది. అయితే, ఈ ఘటనకు కారకులపై ప్రతీకారం తప్పదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా, అది ఏ రూపంలో అన్నది స్పష్టత రాలేదు. ఆఫ్ఘన్ గడ్డపై అమెరికా బలగాలు కొనసాగడం అనేది ఏమాత్రం సాధ్యం కాదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఐసిస్ పై బైడెన్ ప్రతీకారం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.