Revanth Reddy: కేసీఆర్ ను కొట్టాలంటే మధ్యలో ఒవైసీ అడ్డున్నాడు.. దళితబంధు మాదిరి మైనార్టీబంధు ఇవ్వాలి: రేవంత్ రెడ్డి

KCR has to give Minority Bandhu demands Revanth Reddy
షార్ట్స్‌లో చూడండి
దేశానికి స్వాంతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. దేశం కోసం కాంగ్రెస్ ఎన్నో త్యాగాలు చేసిందని చెప్పారు. కాంగ్రెస్ హయాంలోనే మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వచ్చాయని... వైయస్సార్ హయాంలో రిజర్వేషన్లు కల్పిస్తే, ఎంతో మంది మైనార్టీలకు ఉద్యోగ, విద్య అవకాశాలు వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ఈరోజు మైనార్టీ గర్జన సభ జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటులో ట్రిపుల్ తలాక్, ఎన్నార్సీ, సీఏఏ వంటి చట్టాలను వ్యతిరేకించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని రేవంత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ మైనార్టీలదని... పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత మీపైనే ఉందని చెప్పారు. మోదీకి వ్యతిరేకంగా పోరాడగలిగే శక్తి కాంగ్రెస్ కు మాత్రమే ఉందని అన్నారు. కాంగ్రెస్ కు 200 మంది ఎంపీలు ఉంటే ఈ చట్టాలు చేసే ధైర్యాన్ని బీజేపీ చేసేది కాదని చెప్పారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెపితేనే టీఆర్ఎస్ కు మైనార్టీలు ఓట్లు వేశారని అన్నారు. మైనార్టీలకు శత్రువైన కేసీఆర్ ను కొట్టాలంటే మధ్యలో ఒవైసీ అడ్డున్నాడని చెప్పారు. మైనార్టీలకు ఎవరి వల్ల నష్టం జరుగుతోందో చెప్పడానికే మైనార్టీ గర్జనను చేపట్టామని అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు వస్తాయని రేవంత్ చెప్పారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లను ఇస్తామన్న హామీని కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని... 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మైనార్టీలకు 20 నుంచి 30 వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. మైనార్టీ ఓట్లతో సీఎం అయిన కేసీఆర్... ప్రతి ముస్లిం కుటుంబానికి రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితబంధు మాదిరే మైనార్టీబంధు ఇవ్వాలని అన్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress
KCR
TRS
Asaduddin Owaisi
MIM
Minority Bandhu

More Telugu News