ప్రేక్షకులు లేకుండానే ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్
- జపాన్ రాజధాని వేదికగా 32వ ఒలింపిక్ క్రీడలు
- ప్రారంభించిన జపాన్ చక్రవర్తి నరుహిటో
- మార్చ్ పాస్ట్ లో తొలుత గ్రీస్ బృందం రాక
- ఆపై శరణార్థుల జట్టు రాక
తొలుత గ్రీస్ అథ్లెట్లు తమ జాతీయ పతాకం చేతబూని మార్చ్ చేశారు. అనంతరం శరణార్థుల జట్టు మార్చ్ పాస్ట్ లో పాల్గొంది. జపాన్ భాష అక్షర క్రమం ప్రకారం ఆయా దేశాలు మార్చ్ పాస్ట్ లో వరుసగా రానున్నాయి.
కాగా, ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా బంగ్లాదేశ్ కు చెందిన నోబెల్ అవార్డు గ్రహీత మహ్మద్ యూనస్ కు ఒలింపిక్ లారెల్ అవార్డు ప్రదానం చేశారు. ఒలింపిక్ క్రీడలు నేటి నుంచి ఆగస్టు 8 వరకు అలరించనున్నాయి. కరోనా వ్యాప్తి కారణంగా స్టేడియాలకు ప్రేక్షకులను అనుమతించడంలేదు.
మార్చ్ పాస్ట్ లో భారత బృందానికి బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ నేతృత్వం వహించారు. భారత బృందంలో 20 మంది అథ్లెట్లు, ఆరుగురు ప్రతినిధులు పాల్గొన్నారు. మేరీకోమ్, మన్ ప్రీత్ జాతీయ పతాకం చేతబూని ముందు నడస్తుండగా, భారత అథ్లెట్లు వారిని అనుసరించారు.