తొలిరోజే అదరగొట్టిన జొమాటో.. ఐపీవోతో రూ.లక్ష కోట్లు
- షేర్ వాస్తవ ప్రీమియంపై 50% అదనంగా లిస్టింగ్
- ఎన్ఎస్ఈలో రూ.116.. బీఎస్ఈలో రూ.115
- బీఎస్ఈలో టాప్ 50 సంస్థల్లో చోటు
లిస్ట్ అయిన కొద్దిసేపటికే షేర్ ధర 62 శాతం పెరిగింది. ఒకానొక దశలో రూ.138ని తాకింది. దీంతో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.లక్ష కోట్ల మార్కును టచ్ చేసినట్టయింది. బీఎస్ఈలో అత్యధిక విలువ కలిగిన 50 సంస్థల సరసన చేరింది. ఇంకో విశేషమేంటంటే.. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బీపీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలనూ అది దాటేసి ముందుకు పోయింది.
ప్రస్తుతం మార్కెట్లు లాభాల్లో దూసుకుపోవడమూ సంస్థకు కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థ విలువను ఎక్కువ చేసి చూపుతున్నారన్న విమర్శలు ఐపీవో లిస్టింగ్ పై పెద్దగా ప్రభావం చూపలేదు. లాభాలు మరీ ఏం లేకపోయినప్పటికీ.. పెట్టుబడుల్లో స్థిరత్వమే జొమాటో విషయంలో సానుకూల ధోరణికి కారణమై ఉంటుందని అంటున్నారు.
ప్రస్తుతం జొమాటో ఆర్డర్లు 23.89 కోట్లకు పెరిగాయి. 525 నగరాల్లో సంస్థ సేవలందిస్తోంది. 3,89,932 రెస్టారెంట్లు జొమాటోలో ఉన్నాయి. 2018లో కేవలం 3.06 కోట్ల ఆర్డర్లే ఉండగా.. మూడేళ్లలోనే 20 కోట్లు దాటేయడం చూస్తే సంస్థ దేశంలో ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.