ఆపరేటింగ్ సిస్టంలో లోపం.. వెంటనే అప్‌డేట్ చేసుకోవాలన్న మైక్రోసాఫ్ట్

Update your system microsoft urges users
  • ‘ప్రింట్ స్పూలర్’లో భద్రతాపరమైన లోపాలు
  • హ్యాకర్ల ముప్పు పొంచి ఉండడంతో అప్రమత్తం
  • విండోస్ 10, విండోస్ 7లకు అప్‌డేట్ విడుదల
ఆపరేటింగ్ సిస్టంలో లోపం బయటపడడంతో విండోస్ వినియోగదారులందరూ వెంటనే తమ కంప్యూటర్లను అప్‌డేట్ చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ కోరింది. లేదంటే ఈ లోపాన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు చెలరేగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనిని అడ్డుకునేందుకు వెంటనే అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.

విండోస్‌లోని ‘ప్రింట్ స్పూలర్’లో భద్రతా పరమైన లోపాలు ఉన్న విషయాన్ని తాము గుర్తించామని గతేడాది మేలో ‘సాంగ్‌ఫర్’ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ప్రకటించింది. ప్రింట్ స్పూలర్ అనేది ఒకే ప్రింటర్‌ను ఎక్కువమంది ఉపయోగించుకునేందుకు సాయపడుతుంది. ప్రింట్ స్పూలర్‌లో లోపాలను గుర్తించిన సాంగ్‌ఫర్.. దానిని ఎలా హ్యాక్ చేయొచ్చన్న వివరాలను పొరపాటున ఆన్‌లైన్‌లో పెట్టేసింది. ఆ వెంటనే పొరపాటును గుర్తించి డిలీట్ చేసినప్పటికీ అప్పటికే అది చాలామందికి చేరిపోయింది.

‘ప్రింట్ నైట్‌మేర్’గా పిలుస్తున్న ఈ లోపాన్ని హ్యాకర్లు ఉపయోగించుకుని ఇతరుల కంప్యూటర్లలోని డేటాను చూడడం, డిలీట్ చేయడం, కొత్త యూజర్ అకౌంట్లను సృష్టించడం వంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉందని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది. విండోస్ 10, విండోస్ 7లోనూ ఈ లోపం ఉందని పేర్కొన్న మైక్రోసాఫ్ట్ వీటికోసం అప్‌డేట్‌లను విడుదల చేసింది.

వాస్తవానికి విండోస్ 7 అప్‌డేట్స్‌ను ఆపేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్ గతేడాదే ప్రకటించింది. అయితే, తాజా లోపం నేపథ్యంలో దానికి కూడా అప్‌డేట్‌ను విడుదల చేసింది. యూజర్లు అందరూ తప్పకుండా అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా హ్యాకర్ల ముప్పు లేకుండా చూసుకోవాలని కోరింది.
Go Back to Shorts
Windows
Microsoft
Print Spooler
Update

More Telugu News